సూర్యాపేట: భోగి మంటల్లో చెడు ఆహుతై మంచి ఉదయించాలని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. అందరి చెడు ఆలోచనలు భోగి మంటల్లో బూడిదవ్వాలని, సరికొత్త ఆలోచనలు, అభివృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సూర్యాపేట పట్టణంలోని పలు కూడళ్లలో జరిగిన భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, యువత, చిన్నారులు పెద్ద ఎత్తున చేరి భోగి మంటల కాంతుల మధ్య కోలాటం వేస్తూ ఆనందంగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు.
మార్పు మార్పు అనుకుంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదంతా పేర్లు మార్చడంతోనే గడిచిపోయిందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులకు కనువిప్పు కలగాలన్నారు. కేసీఆర్ లాంటి అభివృద్ధి ఆలోచనలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రావాలని చెప్పారు. పాడిపంటలు సమృద్ధిగా పండి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కేసీఆర్ హయాంలో గత పదేండ్లు బ్రహ్మండంగా అభివృద్ధి చెందిందని వెల్లడించారు. ఏడాది కాలంగా రేవంత్ పాలన మంచి ఫలితాలు పొందడంలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. పాలకుల చెడు ఆలోచనలు భోగి మంటల్లో కాలిపోయి మంచి ఆలోచనలతో మార్పు రావాలన్నారు. ప్రజల కష్టాలు తొలగించి ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు.