హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : జర్నలిజం ముసుగులో దుర్మార్గాలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టబోమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. ‘ఇప్పటి వరకు ఊరుకున్నం.. ఇకమీదట సహించబోం’ అని తేల్చిచెప్పారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, భిక్షమయ్య గౌడ్, నేతలు నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్ని మీడియా చానళ్లు బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్‌పై చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డారు.
కీలుబొమ్మలా రేవంత్
ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలుబొమ్మలా మారి తెలంగాణవాదులపైనే దాడులకు ఉసిగొల్పుతున్నారని జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఫీనిక్స్ పక్షిలా కేసీఆర్ తిరిగి లేస్తున్న తరుణంలో తెలంగాణ అంటే గిట్టని మీడియా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని ధ్వజమెత్తారు. కేటీఆర్ ప్రజల పక్షాన గొంతెత్తున్న తీరు తెలంగాణ వ్యతిరేక శక్తులకు నచ్చడం లేదని, అందుకే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏం ఆధారాలున్నయని అరాచకం?
ఫోన్ ట్యాపింగ్‌పై ఏం ఆధారాలున్నాయని కేసీఆర్, కేటీఆర్‌లపై తప్పుడు థంబ్ నెయిల్స్‌తో కొన్ని మీడియా సంస్థలు ప్రసారాలకు దిగుతున్నాయని, ఇదెక్కడి సంస్కృతి అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ‘కొందరు జర్నలిజంను అడ్డుపెట్టుకొని చేస్తున్న అరాచకాలతో ఎందరో ఆడబిడ్డలు క్షోభను అనుభవిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. కోట్లాది మంది కేసీఆర్ అభిమానులు బాధపడుతున్నరని చెప్పారు. దొంగ పోలీసు డ్రెస్ వేసుకొని వచ్చినట్టు.. ఉగ్రవాది మిలటరీ డ్రెస్ ముసుగులో కాల్చి చంపిన చందంగా పాత్రికేయ విలువలను కాలరాస్తూ ఇష్టమొచ్చిన రాతలు రాస్తే..పిచ్చి కూతలు కూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ట్యాపింగ్ చేయాల్సిన కర్మ బీఆర్ఎస్కు లేదని, కాంగ్రెస్సోళ్ల పిచ్చి మాటలు వినాల్సిన అవసరమేమున్నదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు.
30 ఏళ్ల కిందటే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభం
మన దేశంలో 30, 40 ఏండ్ల క్రితమే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని జగదీశ్‌రెడ్డి తెలిపారు. చట్టప్రకారం ఆ హక్కు ప్రభుత్వాలకు ఉన్నదని స్పష్టంచేశారు. ‘ఇప్పుడు దేశంలోని ఏ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడంలేదు? రేవంత్‌రెడ్డి చేయడం లేదని చెప్పగలరా? మాటిమాటికీ గుళ్లకు వెళ్లే నాయకులు ప్రమాణం చేసి చెప్పగలరా? అని నిలదీశారు. ‘ఉద్యమ సమయంలో నా ఫోన్ ట్యాపింగ్‌కు గురైంది.. అనాడు నన్ను వెంటాడి వెతికి పట్టుకున్నరు.. కానీ మేం ఎవరినీ నిందించలేదు.’ అని చెప్పారు. ఎంతో హూందాగా వ్యవహరించామని తెలిపారు. ‘మాకు భాషరాక కాదు..తిట్టలేక కాదు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి గురించి చర్చ జరిగినప్పుడు కేసీఆర్ కూడా బాధపడ్డారు’ అని గుర్తుచేశారు.
బద్నాం చేయడం బాధాకరం
కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో ఆధారరహిత మీమ్స్ పెట్టి ప్రచారం చేయడాన్ని సహించలేకనే బీఆర్ఎస్ నిరసనలకు ఉపక్రమించిందని జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. కొందరు కార్యకర్తలు ఆవేశంగా కొంత కఠినంగా వ్యవహరించి ఉండవచ్చునని, కానీ ఆ చానల్ వాళ్లు రాసిన చిన్న వాక్యం ఎన్ని వేల మంది హృదయాలను గాయపరిచిందో తెలుసుకోకుండా బీఆర్ఎస్ను బద్నాం చేయడం బాధాకరమని తెలిపారు. బీఆర్ఎస్ను బద్నాం చేసిన వాళ్లు.. ఆ చానల్ దుర్మార్గాలను ఖండించి, బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుపడితే అర్థం చేసుకొనేవారమని చెప్పారు. కానీ ఆంధ్రాకు చెందిన పెద్ద నేతలు, తెలంగాణకు చెందిన మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్పై కుట్రలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
మీడియాపై రేవంత్మాటలు వినబడలేదా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మీడియాపై విరుచుపడ్డ సందర్భంలో మిన్నకుండిన నాయకులు ఇప్పుడు చిన్న ఘటనపై రాద్ధాంతం చేయడం విడ్డూరమని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లి రుణమాఫీపై ఆరాతీసిన జర్నలిస్టులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి నిండు శాసనసభలో ‘బట్టలూడదీసి కొడ్తా..పండబెట్టి తొక్కుతా..పేగులు మెడలేసుకుంటా’ అంటూ దూషణలకు దిగితే చప్పట్లు కొట్టిన నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్పై ఒంటికాలిపై లేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుల్లా, రాములోరికి తమ్ముల్లా ఫోజులు కొడుతున్నారని ఎద్దేవాచేశారు.
సమైక్యవాదుల నీడలో కోదండరాం
మహాన్యూస్ చానల్‌పై జరిగిన చిన్నదాడిని సాకుగా చూపుతూ మేధావిగా పేరుగాంచిన కోదండరాం మొసలి కన్నీళ్లు కార్చడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తున్నదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పదవులు రాగానే ఆయన పెదవులు మూసుకున్నారని విమర్శించారు. శాంతిదూతల్లా నటించే వారు కూడా సమైక్యవాదుల నీడలో బతుకుతూ బీఆర్ఎస్పై అభాండాలు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. విలువలను వదిలి వ్యక్తుల జీవితాలతో చెలగాటమాడుతున్న మీడియా సంస్థల పేరిట కొనసాగుతున్న వధశాలలకు వంతపాడటాన్ని చూసి తెలంగాణ సమాజం నివ్వెరపోతున్నదని విమర్శించారు.
డెక్కన్ క్రానికల్, సాక్షిపై దాడుల సంగతేంది?
డెక్కన్ క్రానికల్, సాక్షి మీడియాపై దాడులు చేసిన టీడీపీ, జనసేన నాయకులే ఇప్పుడు నీతులు చెప్తున్నారని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. నీతుల రాయుడు కనుసన్నల్లోనే ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం గురించి కోతలు కోసే పవన్ కల్యాణ్ కూడా దుర్మార్గాలకు పాల్పడ్డ మీడియాకు అనుకూలంగా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉన్నదని చెప్పారు. వారి మాటలు, వారు చేస్తున్న ట్వీట్లు చూస్తుంటే వారి ప్రణాళికలేంటో అర్థమవుతున్నదని, తెలంగాణ సమాజం కూడా నిశితంగా గమనిస్తున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న పగుళ్లు వస్తే రాద్ధాంతం చేసిన బీజేపీ నాయకులు, వారి పాలిత రాష్ర్టాల్లో బ్రిడ్జిలు కూలుతున్నా, ప్రారంభానికి ముందే రైల్వేస్టేషన్ల పైకప్పులు ఎగిరిపోతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయాలను అక్కడి మీడియా ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.
కొందరు దుర్మార్గులు.. చేతగాని దద్దమ్మలు మీడియా సంస్థల ముసుగులో స్లాటర్ హౌస్‌లు నడుపుతున్నరు.. పథకం ప్రకారమే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై దుష్ప్రచారం చేస్తున్నరు.. విలువలకు తిలోదకాలిచ్చి మీమ్స్‌తో దుర్మార్గాలకు పాల్పడుతున్నరు. తెలంగాణ కోసం ప్రాణాలనే లెక్కచేయనోళ్లం.. మీ బాస్‌లనే ఎదిరించినోళ్లం.. ఈ బొమ్మలను లెక్కచెయ్యం..
-జగదీశ్‌రెడ్డి
మోదీ, చంద్రబాబు చేతిలో సీఎం రేవంత్‌రెడ్డి కీలుబొమ్మలా మారి తెలంగాణవాదులపైనే దాడులకు ఉసిగొల్పుతున్నరు. కత్తి వేరొకరిది కానీ చంపుతున్నది తెలంగాణవాళ్లనే. పదేండ్ల పాలనలో రాష్ర్టానికి వన్నె తెచ్చిన కేసీఆర్‌ను మళ్లీ బాహ్య ప్రపంచం గుర్తిస్తున్న వేళ, ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేస్తున్న తరుణంలో తెలంగాణ అంటే గిట్టని మీడియా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. -జగదీశ్‌రెడ్డి