సూర్యాపేట, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఐటెమ్ సాంగ్‌తో పోల్చారు. మాటలకు, చేతలకు పొంతన ఉండదని, ఆయన వ్యాఖ్య లు వింటుంటే సినిమా మధ్యలో బోర్ కొట్టే సన్నివేశాల మధ్య వచ్చే ఐటెమ్ సాంగులా ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. సినిమా కథకు ఆ పాటకు ఎలాంటి సంబంధం ఉండదని, పవన్‌కల్యాణ్ మాటలు కూడా అంతేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో లేనిదేదో ఆయన సృష్టించినట్టు, ఆయన మీ సంగతి చూస్తానన్నట్టు, కాంగ్రెస్ వారేందో ఆపినట్టుగా డ్రామాను రక్తి కట్టించాలని చూశారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌తోపాటు జనసేన, చంద్రబాబు, ప్రధాని మోదీ కలిసి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యమ కాలం నాటి నుంచీ ఇలాంటి ఐటెమ్‌సాంగ్స్ వింటున్నామని, ఇంకా వినిపిస్తాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. అంబేద్కర్ ఏ దేశంలో లేని విధంగా ప్రపంచానికే ఆదర్శంగా ప్రజాస్వామిక భారతదేశాన్ని నిర్మిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ దాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా, రైతు వ్యతిరేక కార్యక్రమాలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరీ రైతుల వడ్లు కొనబోమని తీర్మానం చేయడం రైతుల పట్ల వారికి ఉన్న ప్రేమకు అద్దంపడుతున్నదని పేర్కొన్నారు.
తెలంగాణాకు కేసీఆరే శ్రీరామరక్ష అని, కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకోవాలంటే ఓట్లను కాపాడుకోవాల్సి ఉన్నదని జగదీశ్‌రెడ్డి చెప్పా రు. ‘సర్’ ప్రక్రియ చాలా ముఖ్యమైనదని చాలా ఓట్లు గల్లంతు అయ్యే ప్రమాదం పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. బీఎల్ఏలుగా ప్రతి ఓటరు వద్దకు వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వారికి వివరించే అవకాశం వచ్చిందని అన్నారు. ఎక్కడా లేని విధంగా పంట పెట్టుబడి సాయం కింద రైతు జేబుల్లో డబ్బులు పెట్టి అండగా నిలిచిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. చెరువులు, కుంటలు, కాలువల్లో ఎక్కడైనా రైతులు మో టర్లు పెట్టుకొంటే ఎవరూ ఏమీ అనవద్దని, అంటే తోలు తీస్తానని చెప్పిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో మూసీ మురికి నీటిని తాగిన సూర్యాపేట పట్టణానికి కేసీఆర్ హయాంలో స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్లు అందజేశామని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవి ఇవ్వ డం చేతకావడం లేదని చెప్పారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అదికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను, కేసీఆర్‌ను వేరు చేస్తే నేడు రైతులు పడుతున్న హింస అంతా ఇంత కాదని అన్నారు. రైతులకు రూ.50వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రూ.20 వేల కోట్లు మంజూరు చేసి, అందులో రూ.12వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందని రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంక టేశ్వర్లు, రాంచంద్రనాయక్, ఒంటెద్దు న ర్సింహారెడ్డి, గోపగాని వెంకటనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణను దోచుకొనేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై ప్రయత్నిస్తున్నాయని, అందుకోసం ఓటు చోరీ కుట్రలకు శాయశక్తులా ప్రయత్నిస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ ఓటును కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజలకు ‘సర్’ రూపంలో ఉపద్రవం రాబోతున్నదని, దాని నుంచి బయటపడేందుకు రాజ్యాంగబద్ధంగా యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పారు. ఇటీవల బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. తొండితోనో మొండితోనే తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో కాంగ్రెస్, బీజేపీ కలసి తెలంగాణను దోచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.. మన ఓటు ఉండాలో పోవాలో డిసైడ్ చేసేది ఎన్నికల కమిషన్ అని, పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి కారణం ‘సర్’ ద్వారా ఓట్లను తొలగించడమేనని వివరించారు. 86.43 లక్షల ఓట్లను తొలగించారని, వారంతా 40 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నామని కలెక్టర్‌కు, ఈసీ విన్నవించుకున్నా, మమతాబెనర్జీ సుప్రీంకోర్టులో వాదించినా ఫలితం లేకుండా పోయిందని, ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగబోతున్నదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2018లో చంద్రబాబు సేవామిత్ర యాప్ ఏర్పాటు చేసి అందులో జగన్‌కు అనుకూలంగా ఉన్న 30 లక్షల ఓట్లను తీసివేశారని మోదీ, రేవంత్, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ అంతా ఒక్కటేనని విమర్శించారు. బీఎల్ఏలు సైనికుల్లా పని చేస్తేనే మన ఓటు భద్రంగా ఉంటుందని చెప్పారు.