హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : ‘సీఎం రేవంత్‌రెడ్డిది పూర్తిగా రాక్షస మనస్తత్వం. షాబాద్ సైకో ఘటనకు, ముఖ్యమంత్రి తరచూ ప్రతిపక్ష నేతలపై చేస్తున్న వ్యాఖ్యలకు తేడాయే లేదు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ర్టానికి గొప్ప నీటి వనరులు సృష్టించారని, కానీ, రేవంత్ ప్రభుత్వం అదే ప్రాజెక్టుపై మూర్ఖపు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి.. తమ పార్టీపై, నేతలపై పదేపదే మూర్ఖపు మనస్తత్వంతో దిగజారుడు వ్యాఖ్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చర్చలకు కేసీఆర్ రావాలని పదే పదే రేవంత్‌రెడ్డి కోరుతున్నారని కానీ, ఆయన స్థాయికి తామే ఎక్కువని, అయినా తాము చర్చలకు ఎకడికి పిలిచినా వస్తామని, అసలు ‘ఈ ప్రభుత్వానికి అసెంబ్లీ పెట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు. ‘ఒకసారి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వీళ్లు లాగులు తడుపుకొంటరు‘ అంటూ ఎద్దేవా చేశారు. 2001లో ‘జై తెలంగాణ’ అన్న నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజే కేసీఆర్ తెలంగాణ సాధన కోసం విజయమో? లేక వీర మరణమో? అని నాడు పోరాటానికి బయలుదేరాడని గుర్తుచేశారు. ఆయన నేతృత్వంలో జరిగిన మహోద్యమంలో ఆయన అడుగులో అడుగు వేసి తెలంగాణను సాధించిన కేటీఆర్ సహా తామంతా.. రైతుల కోసం రక్తం ధారపోయడానికి నేడు సిద్ధమేనని తేల్చిచెప్పారు. ఎంత రక్తం చల్లుతావో చల్లు.. తామంతా రక్తం ఇవ్వడానికి సిద్ధమే. సీఎం ఇకనైనా ఇలాంటి రక్తపిశాచాల ప్రవర్తనను మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లుతానన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు.
ఇదే రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తుపాకులు చేతబట్టి ఉద్యమకారులపై గురిపెట్టి వారి రక్తం కండ్ల చూడటానికి ప్రయత్నించలేదా? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ రక్తం చెమటగా మారడం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సిద్ధించిందని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఎలాంటి కేసులు పెట్టాలో డీజీపీ ఆలోచించాలని డిమాండ్ చేశారు.
కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చన్న రిటైర్డ్ ఇంజినీర్లపై సీఎం రేవంత్‌రెడ్డి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సీఎం పదవి పిచ్చిలో పడ్డ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జ్ఞాపకశక్తి తగ్గిందని ఎద్దేవా చేశారు. భద్రాచలం మునిగిపోతుందన్న సీఎం, మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్‌రెడ్డి బాటలోనే ఆయన నడుస్తున్నాడని ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో నేరాలు 50 శాతం పెరిగాయని జగదీశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంపై డీజీపీ సమీక్షలు చేస్తున్నారా? లేదా? అని ప్రశ్నిచారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని, పోక్సో కేసు నిందితుడు చేసిన ఆరు హత్యలే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. సీఎంకు ప్రతిపక్షాలపై బూతులు తిట్టే ధ్యాస, శాంతిభద్రతలను నియంత్రించడంలో లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యాలపై సీఎం సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు మాట్లాడితే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అని అంటారా? నిలదీశారు. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ కాదు, హైబ్రిడ్ కాంగ్రెస్ అని.. బీజేపీ, ఈ కాంగ్రెస్ రెండూ ఒకటేనని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.