సూర్యాపేట, మార్చి 31 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మిన ప్రజలు అధికారం ఇచ్చారని, అయితే సర్కారు పాలన మూర్ఖపు ఆలోచనలతోనే నడుస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి పద్ధతి, వాడుతున్న భాషే ఆయన్ను బొందపెడుతుందని అన్నారు. సోమవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు మోసపోయారు తప్ప రేవంత్‌రెడ్డి మూర్ఖపు మాటలకు కాదని పేర్కొన్నారు.
ఆదివారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన సభలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడంపై మండిపడ్డారు. రేవంత్ సర్కార్ చిన్న సాకుతో కాళేశ్వరాన్ని పండబెట్టి గత రెండు సీజన్లలో రైతుల పంటలను ఎండబెట్టిందని అన్నారు. ప్రాజెక్ట్‌ను తమకు అప్పగిస్తే మూడు రోజుల్లోనే నీటిని ఇస్తామని చెప్పినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపారు. కేసీఆర్‌పై కోపంతో పంటలను ఎండబెట్టడం దుర్మార్గమని అన్నారు. వచ్చే సీజన్‌కు కూడా నీళ్లివ్వాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ బాగానే ఉందని అధికారులు చెప్తున్నా నడిపించే సోయి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఒక్క తడికి నీళ్లిస్తే కనీసం పెట్టుబడి ఖర్చు అయినా తిరిగి వస్తుందని తెలిపారు. వచ్చే సీజన్లో పంటలను సాగు చేసేందుకు, కాళేశ్వరం కొనసాగింపునకు మరో ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ఇందుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.