నేరేడుచర్ల, ఫిబ్రవరి 16 : ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే సీఎం రేవంత్‌రెడ్డి వారి ఆశలను వమ్ముచేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపలసింగారం మాజీ సర్పంచ్ అన్నెం శిరీషాకొండారెడ్డి ఆదివారం తమ సొంత ఖర్చుతో గ్రామానికి బహూకరించిన అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా శిరీషాకొండారెడ్డి అంబులెన్స్‌ను బహూకరించడం సంతోషంగా ఉన్నదని అన్నా రు. ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులను తీసుకురావడంలో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనను అడ్డుకోవడం కోసం రాష్ట్రంలోని జనాభాను తక్కువ చేసి చూపించే విధంగా కులగణన చేపట్టారని విమర్శించారు.
బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కులగణన సర్వే చేపట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా సర్వే శాస్త్రీయంగా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరిచి అన్ని వర్గాలకు న్యా యం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంద ని, నేడు కాంగ్రెస్ పాలనలో అనాథగా మారిందని దుయ్యబట్టారు. మంత్రులు ఎవరికి వారు అందినకాడికి దోచుకుంటున్నారే తప్ప ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా పోయిందని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ పాలన కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.