హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్ని ప్రస్తుతం ద్రోహులే పరిపాలిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఉప్పల్‌లోని మల్లాపూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్వీ సదస్సులో ఆయన పాల్గొని తెలంగాణ ఉద్యమ నేపథ్యంపై విద్యార్థి నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థులతోనే ముందుకు సాగిందని ప్రస్తావించారు. తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కలిసి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ నీళ్లు తెలంగాణ ప్రజలకు దకకుండా ఇంటి దొంగలే కుతంత్రాలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘సినిమాల్లో కూడా కొంతసేపు హీరోపై విలన్ పెత్తనం నడుస్తది. కానీ చివరికి హీరోనే విజయం సాధిస్తడు.. తెలంగాణపైనా అంతిమ విజయం కేసీఆర్‌దే’ అని స్పష్టంచేశారు. విద్యార్థి ఉద్యమాలే అనేక సందర్భాల్లో ప్రజల హకులను సాధించి పెట్టాయని, ప్రధానిగా పనిచేసిన ఇందిరాగాంధీని సైతం గద్దె దించింది విద్యార్థి ఉద్యమాలేనని గుర్తుచేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో విద్యార్థులు పట్టుదలతో పోరాడి విజయం సాధించారని చెప్పారు. బంగ్లాదేశ్‌లో ప్రధానిని పదవి నుంచి దించింది కూడా విద్యార్థి ఉద్యమమేనని తెలిపారు. అనేక దేశాల్లో రాచరికాన్ని రూపు మాపింది విద్యార్థులేనని, ఏ పోలీసులు, మిలటరీవాళ్లు కూడా ఆ ఉద్యమాలను నిలువరించలేక పోయారని గుర్తుచేశారు.
తెలంగాణ నీళ్ల దోపిడీ, మన సాంసృతిక వారసత్వంపై దాడి జరుగుతున్నాయని, వీటిని ఎదుర్కొనేందుకు విద్యార్థి లోకం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని జగదీశ్‌రెడ్డి చెప్పారు. విద్యాశాఖకు కూడా మంత్రిగా ఉండి సీఎం రేవంత్‌రెడ్డి గురుకులాల్లో వంద మంది విద్యార్థుల చావుకు కారణమయ్యారని మండిపడ్డారు. వేరే దేశాల్లో ఇలాంటి తప్పులకు ఉరిశిక్ష వేస్తారని నిప్పులు చెరిగారు. తన గురువు చంద్రబాబులాగే, శిష్యుడు రేవంత్‌రెడ్డి లేని గొప్పలు చెప్పుకొంటున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ తెలంగాణ అని, దీనికి కారణం కేసీఆర్ పాలనే అని, అలాంటి కేసీఆర్‌ను మళ్లీ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారనే విషయం తెలిసే మోదీ, చంద్రబాబు, రేవంత్ కలిసి బీఆర్ఎస్ను బలహీన పర్చే కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
తక్కువ ఖర్చుతో, తక్కువ కాలంలో పూర్తిచేసిన ప్రాజెక్టు కాళేశ్వరమని జగదీశ్‌రెడ్డి వివరించారు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులో చిన్న చిన్న లోపాలు రావడం సహజమని చెప్పారు. మేడిగడ్డలో చిన్న లోపం ఏర్పడితే ఎన్డీఎస్ఏను పంపించి విషయం పెద్దది చేసింది ప్రధాని మోదీ అని దుయ్యబట్టారు. చంద్రబాబు, మోదీ ఆదేశాలను అమలు చేస్తున్న చీడ పురుగు సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. కేసీఆర్ గురించి తెలంగాణలోనే కాదు.. మహారాష్ట్ర, గుజరాత్‌లోనూ మాట్లాడుకుంటున్నారని, అందుకే కేసీఆర్ అంటే మోదీకి భయం ఏర్పడిందని చెప్పారు.
‘అలాంటి కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవితో సంతోషపడితే ఈనాడు తెలంగాణ వచ్చేదా?. కేసులకు భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు భయపడితే స్వాతంత్య్ర సమర యోధులు అయ్యేవారా? అలాంటిది విద్యార్థిలోకం కేసులకు భయపడుతుందా?’ అని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ వల్ల దేశానికి స్వాతంత్య్రం ఎలా వచ్చిందని చెప్తామో, కేసీఆర్ వల్లే తెలంగాణ బాగుపడ్డదని బీఆర్ఎస్వీ నేతలు నేటి తరానికి విడమరచి చెప్పాలని సూచించారు. విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్వీ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
గోదావరి, కృష్ణాజలాలు రాజకీయ సమస్య కాదని, తెలంగాణ ప్రజల బతుకు దెరువు సమస్య అని జగదీశ్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. కరోనా సమయంలోనూ తెలంగాణ వ్యవసాయాన్ని నిలబెట్టి, ఆర్థిక వ్యవస్థను కాపాడింది కేసీఆరే అని గుర్తుచేశారు.