హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని అధికారిక నివాసంలో కాకుండా హోటల్లో బసచేసి అక్కడ ఏపీ సీఎంతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణభవన్‌లో గురువారం మాజీ ఎమ్మెల్యేలు నలమోతు భాసర్‌రావు, గాదరి కిశోర్‌కుమా ర్, బీఆర్ఎస్ నేతలు ఒంటెద్దు నరసింహారెడ్డి, నం ద్యాల దయాకర్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణవాదులు భయపడుతున్నది నిజమవుతున్నదని, ఒక్కో హకును కాంగ్రెస్ ప్రభు త్వం ఏపీకి ధారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ ఏ నీళ్ల కోసమైతే 14 ఏండ్లు పోరాడారో ఆ నీళ్లను రేవంత్‌రెడ్డి ఏపీకి కట్టబెడుతున్నారని విమర్శించారు.
మన నదులు మనకు కాకుండా చేసే కుట్ర జరుగుతున్నదని, ముందు ఢిల్లీకి వెళ్లనన్న రేవంత్‌రెడ్డి.. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ఫోన్‌కాల్‌తో హుటాహుటిన వెళ్లారని అన్నారు. సీఎం హోటల్లో ఉండి రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని విమర్శించారు. ఢిల్లీ మీటింగ్‌కు సంబంధించి జలవివాదాలపై కమిటీ అని తెలంగాణలో, గోదావరి బనకచర్లపై కమిటీ అని ఏపీ ఎడిషన్‌లో ఆంధ్రజ్యో తి హెడ్డింగ్ పెట్టిందని, తెలంగాణకు రేవంత్‌రెడ్డి చేస్తున్న ద్రోహమేమిటో తెలుసుకోవడానికి ఇదొకటిచాలని మండిపడ్డారు. రేవంత్ తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నారో, చంద్రబాబు ఏపీ ప్రజలకు ద్రోహం చేస్తున్నారో ఈ వార్తపై చర్చతో తేలిపోవాలని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై బూతులు కాదు, కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై మా ట్లాడాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డతో సంబంధం లేకుండా గోదావరి జలాలను రైతులకు అందించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ సర్కారు ఆ పనిచేయడం లేదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి వచ్చేవరకు కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టే కుట్ర జరుగుతున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర పంపులు ఆన్ చేయకుండా గోదావరి జలాలను కిందకు వదిలే కుట్రను రేవంత్ ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నారని విమర్శించా రు.
చంద్రబాబుకు వంత పాడుతూ బీజేపీ నేతలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సహాయకులు రాసిచ్చిన స్రిప్ట్‌ను రేవంత్ చదువుతున్నారని చెప్పారు. తన గురువులు మోదీ, చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ నడుచుకుంటున్నారని, ఏడాదిలో రాహుల్‌ను కలవలేదు కానీ వారిద్దరిని రేవంత్ ఎన్నోసార్లు కలుస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీకి మూటలు పంపినా తమకు అభ్యంతరం లేదు కానీ నీళ్ల విషయంలో రేవంత్ తెలంగాణకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు.
‘సీఎం ఎవరికి భయపడుతున్నారు? ఎందు కు భయపడుతున్నారు? ఒక ఫోన్‌కాల్‌కు భయపడతారా? తెలంగాణ ప్రజలు రేవంత్‌కు అధికారం ఇచ్చింది చీకటి ఒప్పందాలు చేసుకోవడానికా? బనకచర్లపై ఇంత పచ్చి అబద్ధం మాట్లాడిన రేవంత్‌కు సీఎం పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు. గోదావరి నదిని ఏపీకి తాకట్టు పెట్టి న సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయాలి’ అని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు డిమాండ్ చేయకుండా నిన్నటి మీటింగ్‌కు సీఎం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. తన తప్పు కప్పి పుచ్చుకునేందుకు రేవంత్‌రెడ్డి మళ్లీ కేటీఆర్‌కు నో టీసు ఇచ్చి డైవర్షన్ రాజకీయాలకు తెర తీసే అవకాశమున్నదని చెప్పారు. తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ప్రజలకు ద్రోహం చేస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కొందరి స్వార్థం కోసం పనిచేసే మీడియా రూపాలను కూడా అర్థంచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.