హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): శాసనసభ చరిత్రలో ఫిబ్రవరి 4 చీకటిరోజు అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో దాదాపు 75-80% ప్రజల ప్రధాన అంశాలపై చర్చ పెడుతున్నట్టు ప్రకటించి సభపెట్టిన నిమిషంలోనే వాయిదా వేయడం దారుణమని పేర్కొన్నారు. దీంతో బడుగు బలహీన, దళిత వర్గాల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి మరోసారి బహిర్గతమైందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బీసీ, ఎస్సీలను మోసం చేశారని మండిపడ్డారు. కులగణన నివేదికపై మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
ఈ సభ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి తన అజ్ఞానా న్ని, అవివేకాన్ని, మూర్ఖత్వాన్ని మరోసారి బయటపెట్టుకొని, బీఆర్ఎస్పై తన అక్కసును వెళ్లగక్కారని విమర్శించారు. కులగణనలో బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ తన వైఖరి స్పష్టం చేసిందని చెప్పారు. బీసీల జనాభా తక్కువగా చూపారని పార్టీ తరఫున ఇప్పటికే చెప్పామని వెల్లడించారు. 3.1% ప్రజల వివరాలు సేకరించకుండానే కులగణన పూర్తయిందని నివేదిక ఇవ్వడం విడ్డూరమని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ పట్ల బీఆర్ఎస్ మొదటి నుంచి సానుకూలంగా ఉన్నదని గుర్తుచేశారు. రిజర్వేషన్ల విషయంలో ఓ వర్గం ప్రజలు తమకు దక్కాల్సిన వాటా రాలేదని చేస్తున్న పోరాటం న్యాయమైనదని, తెలంగాణ ఉద్యమం నుంచి మద్దతుగా ఉన్నామని తెలిపారు. ఇదే విషయమై కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు గుర్తుచేశారు. ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగ సభ ఉన్నదనే ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టారని విమర్శించారు. ఏ వర్గం ప్రజలకు న్యాయం చేశారని ‘సోషల్ జస్టిస్ డే’ అని ప్రకటించుకున్నారని సీఎం రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎంసీఆర్‌హెచ్చార్డీ వెబ్సైట్ నుంచి ఎందుకు తొలిగించారని ప్రశ్నించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నద ని, బీసీ కులగణన సర్వే తప్పుల తడక అని పేర్కొన్నారు. బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్‌ను రాష్ట్రంలో తిరగనియ్యబోమని హె చ్చరించారు. ఆయా వర్గాలను అవమానించి సిగ్గు లేకుండా తెలంగాణ సోషల్ జస్టిస్ డే అని ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం గాంధీభవన్‌లోనే ఆత్మహత్యలు చేసుకున్నారని, వర్గీకరణ అమలు చేయాలని సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చిందని ఇందులో కాంగ్రెస్ కొత్తగా చేసిందేమీ లేదన్నారు.