హైదరాబాద్: రాజకీయాల్లో నటించడం, డైలాగులు చెప్పడంలో రావు గోపాలరావు, కోటా శ్రీనివాసరావును రేవంత్ రెడ్డి (Revanth Reddy) మించిపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఎద్దేవాచేశారు. సోనియాగాంధీ అవార్డు గ్రహీత అయిన రేవంత్ మానసిక స్థితిపై ప్రజల్లో అనుమానం ఉందన్నారు. రేవంత్ రెడ్డి నటనా కౌశల్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఆయన మాటలు వింటే గోబెల్స్ ఆత్మహత్య చేసుకుంటారని చెప్పారు. అబద్దాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి గోబెల్స్‌ను మించిపోయారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, బూడిద భిక్షమయ్య గౌడ్, బీ ఆర్ ఎస్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మాటలు వింటే జైపాల్ రెడ్డి ఆత్మ ఆత్మహత్య చేసుకుంటుందన్నారు. జైపాల్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, తెలంగాణ గురించి మాట్లాడలేదని రేవంత్ రెడ్డి గతంలో అన్నారని చెప్పారు. అసలు రేవంత్‌ని మనిషిలాగా చూడటానికి కూడా జైపాల్ రెడ్డి ఇష్టపడలేదని, గొంగళి పురుగు కంటే హీనంగా చూశారని విమర్శించారు. రేవంత్ రెడ్డిని జైపాల్ రెడ్డి ముందే కరెక్ట్‌గా అంచనా వేశారని మండిపడ్డారు.
‘నీలాంటి వెధవలని కేసీఆర్ ఎప్పుడో చూశారు. రేవంత్ రెడ్డిని దిగిపో అని బీఆర్ఎస్ అధినేత ఎప్పుడూ అనలేదు. నీ విషయంలో జైపాల్ రెడ్డి ఏం పాటించారో కేసీఆర్ అదే పాటించారు. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే కాళోజీ ఏం చెప్పారో అది చేసి తీరుతాం. ప్రాంతేతరులను ఇప్పటికే ప్రారదోలినం. రేవంత్ రెడ్డికి కేసీఆర్‌తో పోలికా. మనుషులను కులంతో చూసే చరిత్ర రేవంత్ రెడ్డిది. కేసీఆర్ నిన్ను చూసి భయపడితే.. మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు?. కొల్లాపూర్‌లో చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రవచనాలు పలికారు. దొంగ నోట్ల కట్టలతో దొరికినట్లు నేడు బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి దొరికి పోయాడు.
రేవంత్ రెడ్డి దుర్మార్గాలను బయటపెడుతున్నందుకు కేసీఆర్, కేటీఆర్‌పై ఏడుస్తున్నారు. అసెంబ్లీ నుంచి ఎవరిని సస్పెండ్ చేయలేదని చెప్పారు. మరి నన్ను సెషన్ నుంచి సస్పెండ్ చేయలేదా?. నాకు ఏ విలువలు లేవు.. అధికారం, డబ్బు ముఖ్యం అని రేవంత్ రెడ్డి చెప్పారు.రేవంత్ రెడ్డి గురించి కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా?. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇద్దామని అన్నారు. 18 నెలలు సమయం ఇచ్చారు. కేసీఆర్ విజ్ఞతకు, రేవంత్ రెడ్డి విజ్ఞతకు చాలా తేడా ఉంది. కేసీఆర్ సీఎం కాకముందు ఉన్న పాలమూరుకు, ముఖ్యమంత్రి అయ్యాక ఉన్న పాలమూరుకు తేడా చూడు రేవంత్ రెడ్డి. నీ గురువు చంద్రబాబునాయుడు తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడిన మాటలు తెలుసుకో. నా కళ్ళ ముందు తెలంగాణ ఆగం అవుతుందని అనుకోలేదని కేసీఆర్ బాధపడుతున్నారు.
తెలంగాణ హక్కులను ధారాదత్తం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినవాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా బాధపడుతున్నారు. సోనియాగాంధీ అవార్డుకు
రేవంత్ రెడ్డి మాత్రమే అర్హుడు . చాలామంది నియంతలు వచ్చి వెళ్లారు. అబద్ధం సిగ్గుపడేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆస్కార్ అవార్డుకు అర్హుడు. స్క్రిప్ట్ రాసిస్తున్న వాళ్ళు రేవంత్ రెడ్డి పరువు తీస్తున్నారు. నువ్వు సీఎం కుర్చీలో ఐదేండ్లు ఉండాలని కోరుతున్నాం. నీ పక్కన ఉన్నవాళ్లతో నీకు భయం ఉంటే మేము ఏం చేయలేం. అందుకే మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నావు. ఒక మంత్రి ఫోన్ ట్యాపింగ్‌కు భయపడి డబ్బా ఫోన్ వాడుతున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఐదేండ్లు ఉండాలి. కానీ మీ వాళ్ళు నిన్ను ఎప్పుడు పీకుతారో తెలియదు. ఎవరెవరు రెచ్చిపోతున్నారో వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం.
పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు అంటే కేసీఆర్ మమ్మల్ని పిలిచి అరిచారు. ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని చెప్పారు. అది తెలంగాణకు పనికివచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ భావజాలం వేరు, బీజేపీ భావజాలం వేరు. చిన్న, పెద్ద బ్రోకర్లు మాట్లాడితే అది పట్టించుకోవద్దు. చంద్రబాబు నాయుడు అలాంటి వారికే పదవులు ఇచ్చారు. సీఎం రమేష్ ఇంటికి నేను కూడా మిత్రునిగా వెళ్ళాను. ఆయన ఇంటికి కేటీఆర్ లేదా నేను వెళ్తే తప్పు ఏంటి?. సీసీ టీవీ ఫుటేజ్‌లు తీయాలంటే సీఎం రమేష్ తన జీవితకాలంలో ఎక్కువగా చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో వుంటారు. మమ్మల్ని భయపెడితేనే బీజేపీలోకి వెళ్లామని ఆయన మాతో చెప్పారు. మేము ఎప్పటికీ చంద్రబాబు మనుషులమే అని సీఎం రమేష్ చెప్పారు. కవిత జైలుకు వెళ్తే బెయిల్ ఇచ్చేది కోర్టు. ఆమె విషయంలో పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ ఎట్లా అంటారు. కేటీఆర్ భాష విషయంలో ఒక్క అక్షరం తప్పు లేదు. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో బీజేపీ ఎంపీ మధ్యవర్తిత్వం వహించారని కేటీఆర్ ముందే చెప్పారు. పథకం ప్రకారం బీజేపీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి డ్రామాలు ఆడుతున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక కేసీఆర్. రాబోయే రోజుల్లో దేశ ప్రభుత్వాన్ని నడపటంలో కేసీఆర్ కీలకం అవుతారు. తాత్కాలికంగా మీరు నాలుగు రోజులు సంతోషపడవచ్చు. బీజేపీ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతామన్నా కేసీఆర్ ఒప్పుకోరు. కులం ప్రస్తావన తెలంగాణ రాజకీయాల్లో ఉందా. అక్కడ కులం గురించే మాట్లాడతారు. కులగజ్జి శిష్యుడు రేవంత్ రెడ్డికి అంటుకుంది. రుత్విక్ కంపెనీ నాది కాదు అన్న సీఎం రమేష్ ఆ మాటలకు కట్టుబడి ఉంటారా?. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్టును చదివారు. జైపాల్ రెడ్డికి ఉన్న మంచిపేరును తన ఖాతాలో వేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేస్తే ఇంకా బీఆర్ఎస్ ఎక్కడ కలుస్తుంది. సీఎం రమేష్ ఎప్పుడూ బీజేపీ ఆఫీస్‌కు వెళ్ళలేదు. మమ్మల్ని చేయి విరిసి బీజేపీలో చేర్చుకున్నారని అన్నారు. ఆయనకు బీజేపీలో అంత సీన్ లేదు. ఆయనను ఎక్కడ ఉంచాలో బీజేపీ వాళ్ళు అక్కడే ఉంచుతారు’ అని జగదీశ్ రెడ్డి అన్నారు.