జూబ్లీహిల్స్‌లో ఓడిపోతే అధికార పార్టీలో ఉపద్రవం రావడం, రేవంత్‌రెడ్డి పదవి పోవడం ఖాయం. ఈ విషయం తెలిసే బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఎజెండాపైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేయబోతున్నారు. రెండేండ్లలో చిన్నపని కూడా చేయని రేవంత్ సర్కారుకు ఓటుతో బుద్ధిచెప్పడం తథ్యం.
-మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్రస్టేషన్లో మూర్ఖంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సీఎం వ్యాఖ్యలు వింటుంటే మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్టుగా అర్థమవుతున్నదని ఎద్దేవా చేశారు. సమయం, సందర్భం లేకుండా ఆయన మాట్లాడుతున్న తీరును చూసి సిగ్గే సిగ్గుపడేలా ఉన్నదని పేర్కొన్నారు. సీఎంకు దమ్మూ ధైర్యముంటే రెండేండ్లలో చేసిన పనులు చెప్పుకొని జూబ్లీహిల్స్ ప్రజలను ఓట్లడగాలని సవాల్ విసిరారు. కేసీఆర్ నిర్మించిన ప్రగతిభవన్, సెక్రటేరియట్, కంట్రోల్ కమాండ్ సెంటర్‌ను వినియోగించుకుంటూనే ఆయనపై అభాండాలు వేయడం దుర్మార్గమని మండపడ్డారు.
శనివారం ఆయన తెలంగాణభవన్‌లో మాజీ ఎంపీ బీ లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డి, బీ భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, దయాకర్రెడ్డితోకలిసి మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి అడ్డదిడ్డమైన భాష, బూతు పురాణంతో తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో శాంతిభద్రతల నిఘా కోసం కంట్రోల్ కమాండ్ సెంటర్‌ను నిర్మిస్తే, రేవంత్‌రెడ్డి పాలనను గాలికొదిలి అందులో కూర్చొని బీఆర్ఎస్పై నిఘా పెడుతున్నారని ఆరోపించారు. నాడు కేసీఆర్ కట్టిన ప్రగతిభవన్‌పై అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి బుల్లెట్‌ప్రూఫ్ కిటికీలను చూపించాలని, లేదంటే ఎైంక్వెరీ కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్‌లో ఓడిపోతే అధికార పార్టీలో ఉపద్రవం రావడం, రేవంత్‌రెడ్డి పదవి పోవడం ఖాయమని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయం తెలిసే బీఆర్ఎస్పై, కేసీఆర్‌పై, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ అభివృద్ధి అజెండాపైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేయబోతున్నారని స్పష్టంచేశారు. రెండేండ్లలో చిన్నపని కూడా చేయని రేవంత్ సర్కారుకు ఓటుతో బుద్ధిచెప్పడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమ ని హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోవ డం ఖాయమని తెలిసే అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల ప్రాపకం కోసం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని, కేటీఆర్‌ను ఓకే గాటాన కట్టడం రేవంత్ అల్పబుద్ధికి నిదర్శమని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ శిశ్యులైన రేవంత్, కిషన్‌రెడ్డే హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్ అని ఎద్దేవా చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రైవేట్ కాలేజీలను దగా చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వారిని భయపెట్టేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని జగదీశ్‌రెడ్డి నిలదీశారు. తప్పులపై తప్పులు చేస్తున్న ముఖ్యమంత్రిని చరిత్ర క్షమించబోదని హెచ్చరించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి భాష మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో క్రైంరేట్ పెరిగిపోయిందని, నేరాలు, ఘోరాలకు అడ్డాగా, డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ మారిపోయిందని విమర్శించారు.