సూర్యాపేట, జూన్ 22 (నమస్తేతెలంగాణ) : ఏపీ సీఎం చంద్రబాబు రూపంలో మరోసారి తెలంగాణ జల దోపిడీకి గురవుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృష్ణానది నీటిని దోచుకుపోతే నేడు చంద్రబాబు గోదావరి నీటిని దోచుకుంటున్నాడని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం ఆయన సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలేనని, ఆ రెండు పార్టీల కలయికతో పుట్టిన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్‌రెడ్డి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టమని అన్నారు. తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది.. నాడు వందలాది మందిని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణను సాధించే క్రమంలో నాడు అడ్డుపడ్డది కూడా చంద్రబాబేనని తెలిపారు.
తెలంగాణలో వలసలు, కరువు కాటకాలు, ఆకలి చావులకు కారణమైంది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలేనని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కరువు కోరల్లో చిక్కుకునేలా రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. నదులు ఎక్కడున్నాయో తెలియని రేవంత్‌రెడ్డి ఇక్కడ దేనినైనా అమ్మేందుకు వెనుకాడటం లేదని విమర్శించారు.
350 టీఎంసీల ప్రాజెక్టు కట్టి రాజశేఖర్‌రెడ్డి దుర్మార్గంగా కృష్ణానది నీటిని తీసుకుపోతుంటే నాటి కాంగ్రెస్, టీడీపీ నాయకులు నోరు మెదపలేదని విమర్శించారు. నేడు గోదావరి నీటిని కూడా దోచుకుపోతుంటే రేవంత్‌రెడ్డి సీఎంగా ఉండి నోరు మెదపలేని దుస్థితిలో ఉన్నాడని మండిపడ్డారు. తన పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్‌రెడ్డి తెలంగాణ మొత్తం దోచుకుపోయినా స్పందించడని పేర్కొన్నారు. ఈ దారుణాన్ని బీఆర్ఎస్ సహించదని, కేసీఆర్ మరో ఉద్యమం చేస్తే తప్ప జల దోపిడీని ఆపలేమని స్పష్టం చేశారు.