సూర్యాపేట, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) :మంత్రి కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. స్థాయి లేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సురేఖ మాటలు సొంత పార్టీ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయని అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. ‘మూసీ నదిని ఏదో ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు పదేపదే ప్రగల్బాలు పలుకుతున్నారని, కానీ ముందు మురుగుతో కూడుకుపోయిన వారి బుర్రలను ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు.
నేటి మూసీ దుస్థితికి కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమింది కేసీఆరో లేక కాంగ్రెస్ పార్టీనో ప్రజలను అడిగితే చెప్తారన్నారు. మూసీ ప్రక్షాళన కాదు.. సీఎం, మంత్రుల బుర్రలు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
మూసీ మురికి కన్నా ఎక్కువ కలుషితమైన కాంగ్రెస్ ఆలోచనల సుందరీకరణ జరగాలని అన్నారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే ఉద్యమం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి అనడం పట్ల ఆయన మానసికస్థితి సరిగ్గా లేదని స్పష్టమవుతున్నదని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో మూసీ స్థితిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. హామీల అమలులో విఫలమై కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు.
మొదట హైడ్రా.. అది విఫలం కావడంతో సినీ తారలపై ఆరోపణల అంశం తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. రేవంత్ డైవర్షన్ రాజకీయాలతో ఎన్నో కుటుంబాలు నాశనమయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తంగా రాష్ట్రంలో రేవంత్ పాలన అగమ్యగోచరంగా మారిందని, 2014కు ముందు, తరువాత జరిగిన అభివృద్ధి ప్రతి ఒక్కరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యమని స్పష్టం చేశారు.