చండూరు, జూలై 3: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కమీషన్లతోనే కాలం గడుపుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా రూపాయి అభివృద్ధి చేయలేదు కానీ, బీఆర్ఎస్ నాయకులపై వందల కేసులు పెట్టిందని దుయ్యబట్టారు. గురువారం ఆయన నల్లగొండ జిల్లా చండూరులో మీడియాతో మాట్లాడారు. చండూరు మాజీ ఎంపీపీ ఇంటిని అన్యాయంగా కూల్చి వేశారని అన్నారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థతో నడిపిస్తున్న కాంగ్రెస్ పాలనపై ప్రశ్నించిన వారిపై ఈ అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పని కావాలన్న కమీషన్ల రాజ్యం నడుస్తుందని అన్నారు. తెలంగాణ వచ్చే నాటికి నల్లగొండ జిల్లా ఆఖరులో ఉంటే కేసీఆర్ పరిపాలనలో అగ్రస్థానం నిలిచిందని గుర్తుచేశారు.
మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు వారు నిర్వహిస్తున్న శాఖలపై కనీస అవగాహన లేదన్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా శాఖలు తీసుకున్నారని ఎద్దేవా చేశా రు. సీఎం, మంత్రులు కేసీఆర్‌ను తిట్టడంలోనే పోటీ పడుతున్నారని అన్నారు. కృష్ణానదితోపాటు గోదావరి జలాలను సైతం ఆంధ్రావారికి అప్పజెప్పుతున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్వాయి స్రవంతి, కర్నాటి వెంకటేశం, రెగట్టే మల్లికార్జునరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న పాల్గొన్నారు.