హైదరాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రేవంత్ హయాంలో దోపిడీ పాలన సాగుతున్నదని, రెండేండ్ల కాంగ్రెస్ పా లన దోచుకో.. దాచుకో.. పంచుకో అన్నట్టు ఉ న్నదంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు వాటాలు, మూటల పంపకంలో మునిగితేలుతూ ప్రజలను, వారికిచ్చిన హామీలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.
ఆరు నెలలుగా రాష్ట్ర రాజకీయాలు, మీడియాలోనూ విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, పాలేరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని కొన్ని మీ డియా సంస్థలు కేసీఆర్‌పై తప్పుడు కూతలు కూస్తూ, రోత రాతలు రాస్తూ పైశాచిక ఆనం దం పొందుతున్నాయని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత చింతల ప్రభాకర్‌రెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడా రు.
ఎప్పుడూలేని విధంగా కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో సీఎం, మంత్రులు ఎవరికీ వారే అక్రమపర్వానికి తెరలేపారని ధ్వజమెత్తారు. ‘ఆరు నెలల క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు నుంచి మొదలైంది.. తనకు తెలియకుండానే కొత్త మద్యం కంపెనీలకు టెండర్లు ఇచ్చారని చెప్పారు. రవాణా శాఖలో తన దృష్టికి రాకుండానే జీవోలు అమలవుతున్నాయని మంత్రి పొన్నం నిస్సహాయత వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ కూతురు స్వయంగా సీఎం, రెవెన్యూ మంత్రిపై ఆరోపణలు గుప్పించారు.
మరో మహిళా మంత్రి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నందుకు ఏకంగా పీఏను తొలగించారు. ముఖ్యమంత్రికి తెలియకుండానే మంత్రే హిల్ట్ పాలసీని బయటపెట్టారని అనుకూల మీడియాలో వార్తలు రాయించారు. సినిమా టికెట్ల రేట్ల సంగతి నాకు తెలియదని సంబంధిత మంత్రి నిట్టూర్చారు’ అని తనదైన శైలిలో విమర్శనాస్ర్తాలు సంధించారు.
సీఎం రేవంత్ నిజస్వరూపం ఖమ్మం సభ లో స్పష్టంగా బట్టబయలైందని జగదీశ్‌రెడ్డి చె ప్పారు. సభలో టీడీపీ జెండాలు కనిపించినప్పుడే పరిస్థితి అర్థమైందని, రేవంత్ నిస్సిగ్గుగా చంద్రబాబు జపం చేస్తూ కేసీఆర్‌ను పాతరేస్తానని ప్రగల్భాలు పలకడం దురదృష్టకరమన్నా రు. మహాకవి కాళోజీ చెప్పినట్టు ప్రాంతేతరుడైన గురువును ప్రజలు పారదోలారని, కానీ ఇదే ప్రాంతానికి చెందిన రేవంత్‌ను పాతరేస్తారని హెచ్చరించారు. రేవంత్‌కు దమ్ముంటే బీఆర్ఎస్ జెండా గద్దెలను ముట్టుకోవాలని సవాల్ విసిరారు. గద్దెలను ముట్టుకుంటే గులాబీ పార్టీ తడాఖా చూపుతామని హెచ్చరించారు.
మీడియాలో మంత్రి, ఓ ఐఏఏస్ అధికారి పై వచ్చిన కథనాన్ని అడ్డుపెట్టుకొని సిట్ వేయాలని, చర్యలు తీసుకోవాలని నీతులు చెప్పిన పోలీసు అధికారులు.. ఇప్పుడు ఖమ్మం సభ లో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలని మాట్లాడిన సీఎంపై డీజీపీ, ఖమ్మం సీపీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, తన కుటుంబీకులపై ఇష్టమొచ్చినట్టు పోస్టులు పెడుతున్న అధికార పార్టీ సోష ల్ మీడియా సంస్థలను వెనకేసుకు రావడంలోని అంతర్యమేమిటని ప్రశ్నించారు.
కేసీఆర్ తెలంగాణలో టీడీపీని ఖతం చేశారని రేవంత్ నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. నాడు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం సూట్ కేసులతో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబును రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని ఎద్దేవా చేశారు. రేవంత్ చేసిన నీచపు పనితోనే తెలంగాణలో టీడీపీ ఖతమైందని స్పష్టంచేశారు. నాడు టీడీపీని ఖతం చేసినట్టే ఇప్పుడు కాంగ్రెస్‌ను సైతం ముంచుతున్నారని ఆరోపించారు. గురువు ద్వారా కేంద్రంతో కుమ్మక్కై మంత్రులపై తన అనుకూల మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేయిస్తూ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. అసలు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా కండ్లు తెరవాలని హితబోధ చేశారు.
సింగరేణి టెండర్లలో అక్రమాలు జరిగాయ నే నెపంతోనే రద్దు చేశామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పడం శోచనీయమని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లా దోచుకుంటున్నారనేందుకు టెండర్ల రద్దే నిదర్శనమని స్పష్టంచేశారు. అక్రమాలు జరగకుంటే టెండర్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ఏసీబీ విచారణకు ఆదేశించి అక్రమాల నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.
విశ్లేషణల పేరిట కొన్ని పత్రికలు కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు, ఇక్కడి అధికారులపై విషం చిమ్ముతున్నాయని జగదీశ్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సదరు పత్రికాధిపతి తన పాలేరు అధికారంలో ఉన్నారని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కానీ పాలేరు అధికారం శాశ్వతం కాదని.. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. వ్యవహారంపై అధికారుల సంఘం స్పందించాలని, డీజీపీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
లేదం టే సామాన్యులకు ఓ న్యాయం.. అధికార పార్టీ కి వత్తాసు పలికే మీడియాకు మరో న్యాయమని ప్రజలు భావించే ప్రమాదం ఉంటుందని స్పష్టంచేశారు. కేసీఆర్ పాలనలో ఏనాడూ మీడియాపై వ్యక్తిగత కక్షకు దిగలేదని, అభివృద్ధి కోసం ఆయనపై విషపు రాతలు రాసిన పత్రికలను సైతం ఆదరించారన్నారు. ఆ పత్రి కా కార్యాలయం తగలబడితే ఉదారతతో ఆ దుకున్న విషయాన్ని గుర్తుచేశారు. కానీ ఇప్పు డు అవే మీడియా సంస్థలు స్లాటర్హౌస్ల్లా మారి కేసీఆర్‌పై తప్పుడు రాతలు రాయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికైనా రోత రాతలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు సైతం ఆలోచించాలని, కాంగ్రెస్ సర్కారుకు తగిన బుద్ధిచెప్పాలని కోరారు.
420 హామీలు, ఆరు గ్యారెంటీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ నేతలు అవినీతిలో మునిగితేలుతున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు సీఎం, మంత్రులు కలిసి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. మంత్రుల బాగోతాలు రోజుకోకటి బట్టబయలవుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం బుకాయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థల్లోనూ ఇలాంటి పోకడలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఒక మీడియాలో మంత్రులు, అధికారుల మధ్య వీడియోలు వస్తే.. మరో మీడియాలో ఇంకోరకమైన వార్తలు వస్తాయని.. కానీ సీఎం మాత్రం సిగ్గులేకుండా పాలన పారదర్శకంగా ఉన్నదని గొప్పలు చెప్పుకుంటున్నారని నిప్పులు చెరిగారు. సీఎం, తన గురువు కనుసన్నల్లో రాష్ట్రం పరువు తీస్తూ ఒకరి దగ్గరకు వెళ్లి కాళ్లు మొక్కినప్పుడే మంత్రులపై కథనాలు వచ్చాయని గుర్తుచేశారు. అసలు కాంగ్రెస్ నాయకులైన శ్రీధర్‌బాబు, పొన్నం, కోమటిరెడ్డిపైనే ఆరోపణలు వచ్చాయని స్పష్టంచేశారు.