మహబూబ్‌నగర్/నల్లగొండ, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్ఎల్బీసీ పనులు చేపట్టేముందు జియాలజికల్ సర్వే నివేదిక ఆధారంగా పనులు మొదలుపెట్టకుండా ఒక నేత ఒత్తిడితో ఆదరాబాదరాగా టన్నెల్ పనులు మొదలు పెట్టారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ బృందం ఎస్ఎల్బీసీ టన్నెల్ సందర్శన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగి ఆరు రోజులైనా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని ఆందోళన వ్యక్తంచేశారు.
మంత్రులు ఫొటోలు దిగడం తప్ప ఈ ఆరు రోజుల్లో చేసిందేమీ లేదని విమర్శించారు. తన జిల్లాలో ఇంతపెద్ద ఘటన జరిగి ఇన్ని రోజులైనా ఇక్కడకు రావడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తీరికలేదా? అని ప్రశ్నించారు. లోపల చిక్కుకున్న కార్మికలు, ఇంజినీర్ల ప్రాణాలను కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఏమాత్రం లేదని విమర్శించారు. జియలాజికల్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన జరగడం దురదృష్టకరమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏదైనా ప్రాజెక్టు రూపకల్పన చేసేముందు సత్వర ఫలితాలు ప్రజలకు అందించాలనే తపన పాలకులకు ఉండాలని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో సమానంగా మొదలుపెట్టిన ఏపీకి చెందిన పోతిరెడ్డిపాడును ఆఘమేఘాల మీద పూర్తి చేస్తారని, ఎస్ఎల్బీసీ ఎన్నటికీ ఒడవని ముచ్చటగా ఉండాలనే వివక్షను ఆనాడే ఎత్తిచూపామని అన్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.2,811 కోట్లతో ఈపీసీ కింద చేపట్టాలని జీవో-147 ఇచ్చారని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా హరీశ్‌రావు నేతృత్వంలో దాదాపు 64 కిలోమీటర్ల వరకు టన్నెల్‌ను 11.5 డయాతో మూడేండ్లలోపులోనే పూర్తి చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తున్నదని విమర్శించారు. ప్రాజెక్టు పునఃప్రారంభానికి ముందు సాంకేతికంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు.