హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో 1956 నుంచి 2014 వరకు మూసీ, చెరువులు, నాలాలు ఎలా ఉండేవి? ఎలా అయ్యాయో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమా? అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్ అని, తెలంగాణలో సకల దరిద్రాలకు ఆ పార్టీయే కారణమని మండిపడ్డారు.
ఢిల్లీకి డబ్బుల మూటలు మోసేందుకే లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని విమర్శించారు. బుకాయింపుల్లో, అబద్ధాల్లో భట్టి విక్రమార్క రేవంత్‌రెడ్డిని మించిపోయాడని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూసీ సుందరీకరణ ఎవరి కోసమో?, దానిని ఏం చేయదలుచుకున్నారో? చెప్పాలంటూ నిలదీశారు. సీఎం చెప్పిన మాటలు కూడా డిప్యూటీ సీఎంకు తెలియడం లేదని, లక్షా 50 వేల కోట్లు అని స్వయంగా సీఎం చెప్పారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మించాయని, వాటిలో కొన్ని ఎఫ్టీఎల్లో ఉన్నాయని, ఆ ప్రాజెక్టులను కూలగొట్టే దమ్ము ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ఉన్నదా అని జగదీశ్‌రెడ్డి సవాల్ చేశారు.
మూసీతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా అవుతుందని, ఇప్పటికే వెయ్యి కోట్ల విలువైన పేదల ఇండ్లను కూల్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీ కడుపు నింపుకొనేందుకు మూసీ ప్రాజెక్టు, డబ్బుల కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. డబ్బుల సంపాదనలో భట్టి సీఎంతో పోటీ పడుతున్నారని ఆరోపించారు. ‘మీ వద్ద మూసీ ప్రణాళిక ఉన్నదా? మూసీ మురికిగా మారడానికి పాత బాసులు, కొత్త బాసులు కారణం కాదా?’ అంటూ నిలదీశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారికి కారణం కాంగ్రెస్ కాదా? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఫ్లోరోసిస్‌ను రూపుమాపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు మూసీని మురికి కూపంగా మార్చితే ప్రక్షాళనకు 16 వేల కోట్లతో బీఆర్ఎస్ పనులు ప్రారంభించిందని, ఇప్పటికైనా మూసీ సుందరీకరణ, ప్రక్షాళన పనులను దమ్ముంటే తమకు అప్పగించాలని, రూ.16వేల కోట్లతోనే పూర్తిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హిమాయత్‌సాగర్‌కు నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ఈ పని పూర్తిచేసేందుకు కాంగ్రెస్‌కు చేతకాకుంటే చేసేందుకు తాము రెడీగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిధుల్లేవు కానీ, మూసీకి లక్షన్నర కోట్లు ఎకడి నుంచి తెస్తారని నిలదీశారు.
తెలంగాణ భవన్ అంటే తెలంగాణ ప్రజలకు ఓ ధైర్యమని, ఆత్మగౌరవానికి ప్రతీక అని కేసీఆర్ ఏనాడో చెప్పారని, మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు తండోపతండాలుగా రావడం కేసీఆర్ మాటలను రుజువు చేసిందని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ‘సోషల్ మీడియా వాళ్లను చూసి భయపడుతున్న రేవంత్‌రెడ్డికి కేసీఆర్ కావాల్నా? మా కార్యకర్త చాలు’ అంటూ ఎద్దేవాచేశారు. కర్ణాటక, తెలంగాణలో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని హర్యానా ప్రజలు గ్రహించి కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బీ లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ నేతలు జీ దేవిప్రసాద్, ఓ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.