హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెకలా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక, ఏజెన్సీలు కనికరించక వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. కొన్నిశాఖల్లో మూడు నుంచి, మరికొన్ని శాఖల్లో తొమ్మిది నెలలుగా జీతాలు రావడంలేదు. వైద్యారోగ్య, విద్యుత్తు, మున్సిపల్ వంటి కీలక విభాగాల్లో శ్రమిస్తున్నా.. కనీసం వేతనం అందకపోవడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులు చేసిన పనికి వేతనం అడిగితే.. రేపట్నుంచి డ్యూటీకి రావొద్దు.. ఇంటికి వెళ్లిపోండి’ అంటూ ఏజెన్సీ నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నారు. ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం.. వారికే వత్తాసు పలుకుతున్నదని ఉద్యోగులు, కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పండుగ పూటా పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొన్నదని వాపోతున్నారు.
జీతం అడిగితే బెదిరించడమేంటి?
రాష్ట్రంలో దాదాపు 4,95,000 కాంట్రాక్ట్, ఔట్ సోర్స్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో ఔట్ సోర్సింగ్ సిబ్బంది సుమారు రెండు లక్షల మంది వరకు ఉన్నారు. గతంలో వీరికి రెగ్యులర్‌గా జీతాలు అందేవి. కానీ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీలతో మభ్యపెట్టింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను విధానం రద్దు చేస్తామని నమ్మబలికింది. ప్రభుత్వ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, జీతాలు చెల్లిస్తామని చెప్పింది. సమాన పనికి సమాన వేతనం విధానం అమలు చేస్తామని పేర్కొన్నది. కాంట్రాక్ట్ ఉద్యోగులను దశలవారీగా క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచుతామని తెలిపింది. కాంగ్రస్ గెలిచి రెండేండ్లు పూర్తయినా హామీల అమలు దిశగా ఒక అడుగు కూడా పడలేదు. నెలవారీగా ఇచ్చే జీతాలను కూడా సర్కార్ నిలిపివేయడం దారుణమని సిబ్బంది మండిపడుతున్నారు. కార్యాచరణ సిద్ధం… సర్కార్‌ను నిలదీస్తం
ఇటీవల అసెంబ్లీలో, మండలిలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి ప్రస్తావించినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలి. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేయాలి. లేకపోతే లక్ష మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సచివాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధం. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా వెనకాడం.
-పొన్నమల్ల యాదగిరి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ వైస్ ప్రెసిడెంట్