హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి ప్రత్యేక దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు గురువారం సచివాలయంలో దేవాదాయా ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లు పూర్తవుతున్నా విభజన హామీ ప్రకారం ప్రత్యేక దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం తీసుకురాలేదని గుర్తు చేశారు. 30/87, 33/2007 చట్టాలను రద్దు చేసి ఆ చట్టంలో ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే 261-888 సెక్షన్లను సవరించుకోవడానికి నూతన చట్టం ఉపయోగపడుతుందని మంత్రికి సూచించారు. పాత చట్టం వల్ల రాష్ట్రంలోని ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ఇబ్బంది కలుగుతున్నదని వెల్లడించారు.
ప్రభుత్వం ఈ విషయమై దృష్టిసారించి నూతన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. వారి వినతికి సానుకూలంగా స్పందించిన మంత్రి కొండా సురేఖ.. సీఎం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో ప్రత్యేక చట్టం కోసం ప్రతిపాదన చేయాలని కోరతానని చెప్పారు. అలాగే, అర్చకుల ప్రమోషన్ల విషయంలోనూ తీవ్ర జాప్యం జరుగుతున్నదని జేఏసీ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అర్చక పరీక్షలు 2013 తర్వాత మళ్లీ 2023లో నిర్వహించారని అన్నారు.కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ పరాశరం రవీంద్రాచార్యులు, అర్చక సమాఖ్య నూతన అధ్యక్షుడు గట్టు శ్రీనివాసాచార్యులు, ధూపదీప నైవేద్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కలకోట లక్ష్మీనరసింహాచార్యులు, రాష్ట్ర కార్యదర్శి పెండెం సురేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్నిహోత్రం చంద్రశేఖర్ శర్మ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తాండూరు కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.