హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : కార్మికులను భయభ్రాంతులకు గురిచేయడానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తున్నదని జేఏసీ నేతలు మండిపడ్డారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుంచి ఈ తతంగం నడుస్తున్నదని ధ్వజమెత్తారు. డిమాండ్లను పరిష్కరించకుండా పక్కనపెట్టి ప్రతిరోజూ డిపోలలో గేట్ మీటింగ్‌లు నిర్వహిస్తూ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని వివర్శించారు. ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై చర్చించడానికి జేఏసీ ప్రతినిధులు సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. అనంతరం జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో-కన్వీనర్లు యాదయ్య, సురేశ్ మాట్లాడుతూ.. ‘ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి లేని ప్రమాదం ఎలక్ట్రిక్ బస్సులతో ఉన్నది.
2025లో 2,800 ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని, ఇవే కాకుండా రాబోయే రోజుల్లో 3 వేల బస్సులు తీసుకువస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పటికీ యాజమాన్యం ఆ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నది. మహిళా సంఘాలతో మరో 600 ప్రైవేట్ బస్సులను కొంటామని రవాణాశాఖ మంత్రి చెప్తున్నారు. ఇటు సీఎం, అటు రవాణా మంత్రి మాటలను పరిశీలిస్తే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఎన్నో ఏండ్ల నుంచి మా రక్తాన్ని ధారబోసి కట్టుకున్న డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పుతున్నారు. డిపోలను తమ సొంత ఇంటిగా భావించి 30-40 ఏండ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్న కార్మికులను బలవంతంగా గెంటివేస్తున్నారు. కార్మికుల ఆవేదన ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు. సంస్థను కాపాడుకోవడానికి, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి జేఏసీ పోరాడుతున్నదని తెలిపారు. తమ పోరాటానికి అధికారులు, సూపర్వైజర్లు, ఇతర కార్మిక సంఘాలు మద్దతుగా నిలువాలని కోరారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోలను సందర్శించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని జేఏసీ నేతలు పేర్కొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తేతెలంగాణ): ఆర్టీసీ ప్రవేశపెట్టిన ‘గమ్యం’ యాప్ గతితప్పుతున్నది. ఈ యాప్ సరిగా పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. యాప్‌లో చూపించిన సమయం కన్నా అరగంట ఆలస్యంగా లేదా గంట ముందుగానే బస్సులు రాకపోకలు సాగిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బస్సులే లేవంటూ యాప్‌లో కనిపించడంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. బస్సుల్లో ఉండే చిప్‌లలో సర్వీసు రూట్ల వివరాలు నమోదు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. దీన్ని పరిష్కరించడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది.