హైదరాబాద్, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ): బీసీలకు న్యాయపరమైన రిజర్వేషన్ల సాధన కోసం బీసీ యువత, మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, కులసంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, కులవృత్తిదారులు, ఎంబీసీలు, సంచార, అర్థసంచార కులాలన్నీ కలిసి అఖిలపక్ష బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీగా ఏర్పాటయ్యాయి. జేఏసీ జాతీయ అధ్యక్షుడిగా దుండ్ర కుమారస్వామి ఎన్నికయ్యారు. 18న నిర్వహించ తలపెట్టిన బీసీ బంద్‌కు జేఏసీ మద్దతు తెలిపింది.
బీసీల రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ జేఏసీ పూర్తి కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పా రు. కేంద్రం రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు న్యాయపరమైన రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా బీసీ సమాజం ఉద్యమానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు.
బంద్‌ను విజయవంతం చేయాలి ; రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు 18న నిర్వహించ తలపెట్టిన బంద్‌లో విశ్వకర్మలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు మదన్మోహన్, చొల్లేటి కృష్ణమాచార్యులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ బంద్‌కు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. భవిష్యత్ తరాల మేలు కోసం బంద్‌లో పాల్గొనాలని కోరారు.