హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లు అమలయ్యే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావును నిరుద్యోగ జేఏసీ నాయకులు కోరారు. గ్రూప్-2కు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు శుక్రవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. గ్రూప్-2లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, గ్రూప్-1 మొయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అనుమతించేవిధంగా ప్రభుత్వంపై నిరుద్యోగుల పక్షాన ఒత్తిడి పెంచాలని కోరుతూ కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు.
నిరుద్యోగ జేఏసీగా తాము కూడా భవిషత్తులో కాంగ్రెస్ ప్రభుత్వంపై దశలవారీగా ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా వారు కేటీఆర్‌కు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో నిరుద్యోగ జేఏసీ నేతలు దామోదర్‌రెడ్డి, విక్రమ్‌తోపాటు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు తుంగ బాలు తదితరులు ఉన్నారు.