రాజన్న సిరిసిల్ల, జూలై 28 (నమస్తే తెలంగాణ)/గట్టుప్పల్ (చండూరు): బతుకమ్మ చీరలను సూరత్ నుంచి కిలోల చొప్పున తీసుకొచ్చారంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేతన్నలను అవమానపరిచేలా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వస్త్ర పరిశ్ర మ అనుబంధ సంఘాల జేఏసీ డిమాండ్ చే సింది. వస్త్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించి, నేతన్నలకు ఉపాధి కల్పించాలని కోరుతూ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నేతన్నల దీక్ష ఆదివారం ముగిసింది.
తెలంగాణ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి బతుకమ్మ చీరలు సిరిసిల్లలో కాకుండా సూ రత్ నుంచి తెచ్చారని మాట్లాడటం సిగ్గుచేటని మం డిపడ్డారు. సీఎం తన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సోమవారం నిర్వహించనున్న సిరిసిల్ల కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
సమస్యలు పరిషరించాలని చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్లు నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో మహా ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దాంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రింటెడ్ చీరలను అరికట్టాలని వాటిని దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. 11 నెలలుగా త్రిఫ్ట్ ఫండ్ నిధులు రావడం లేదని, 8 నెలలుగా ఆగిన చేనేత మిత్ర నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.