హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ‘అయ్యా.. సీఎం రేవంత్‌రెడ్డి గారు. 9వేల మంది పెన్షనర్లకు 20 నెలల్లో రూ.20వేల కోట్లు బాకీ పడ్డరు. ఏడాదిన్నర నుంచి ఒక్క రూపాయి కూడా ఇయ్యకపోతిరి. మేం దాచుకున్న డబ్బులే మాకియ్యరా? మాకు ఎన్నాళ్లీ ఎదురుచూపులు. పెన్షన్ ప్రయోజనాలు అందక మనోవేదనతో 26మంది చనిపోయారు, కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. మరో 16మంది కిడ్నీ, లివర్ సమస్యలతో దవాఖానల్లో ఉన్నారు. ఈహెచ్ఎస్ అమలుకాక వాళ్లు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇంతమంది చనిపోయినా మీకు దయలేదా? జర పెన్షనర్లను చంపకండి.. బతకనీయండి. రాష్ట్రంలోని మూడు లక్షల పెన్షనర్ల కుటుంబాల ఉసురు కాంగ్రెస్ సర్కారుకు తగులుతది’ అని పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం ‘చలో హైదరాబాద్’కు పిలుపునిచ్చిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. పెన్షనర్ల విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
‘ఏప్రిల్ 2024 నుంచి ఇప్పటివరకు 9వేల మంది రిటైరయ్యారు. ఒక్కొక్కరికి కనిష్ఠంగా రూ.40 లక్షల నుంచి గరిష్టంగా రూ.కోటి కలిపి మొత్తం రూ.16వేల కోట్లు అందాల్సి ఉంది. ఇవేగాక ఏరియర్స్, పెండింగ్ బిల్లులున్నాయి. జీపీఎఫ్, టీజీఎల్ఐ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ అన్నీ కలిపి రూ.20వేల కోట్లవుతుంది. 20 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నెలకు రూ.700కోట్లు ఇస్తామని రెండు నెలలు మాత్రమే ఇచ్చారు. బకాయిలు మాత్రం గుట్టల్లా పేరుకుపోతున్నాయి.
రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక, మనోవేదనతో ఇప్పటివరకు 26మంది చనిపోయారు. కొందరు అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. ఇంకా ఎంత మంది పెన్షనర్లు చావాలి. ఇంత దయనీయ పరిస్థితులుంటే ప్రభుత్వం కండ్లు తెరవదా? ఎన్నోసార్లు సీఎస్‌ను కలిస్తిమి. మంత్రులకు వినతిపత్రాలిస్తిమి. ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపాయె. రాళ్లు, గోడలకు చెప్పుకున్నట్టే ఉన్నది మా పరిస్థితి. రాళ్లయినా కరుగుతయేమో కానీ.. ఈ సర్కారు మనసు కరగడం లేదు.
ప్రమాణస్వీకారం చేసిన 15రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నరు. ఈహెచ్ఎస్ అమలుచేస్తామని మాటిచ్చారు. మ్యానిఫెస్టోలో పెట్టారు. ఇప్పటికీ అతీగతీ లేదు. రిటైర్డ్ ఉద్యోగుల్లో అనేక మంది రుగ్మతలు, వ్యాధుల బారినపడ్డవారున్నరు. దవాఖానల్లో లక్షలాది బిల్లులు కట్టలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈహెచ్ఎస్ స్కీం అమలైతే కొందరినైనా బతికించుకునేవాళ్లం. చిన్నపాటి అనారోగ్యానికే అధికారులు కార్పొరేట్ దవాఖాన్లకు పరుగులు పెడతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశాలకు పరుగో పరుగో అంటారు. అధికారులు, పెద్దలకు పెన్షనర్ల బాధలు మీకు తెలియవా? తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యమా?
ఐదేండ్లు ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారు రెండు, మూడు పెన్షన్లు తీసుకుంటున్నారు. కానీ 30 -35 ఏండ్లు సేవలందించిన మా పెన్షనర్లకు ప్రయోజనాలిచ్చేందుకు డబ్బులుండవా? మా డబ్బులు మాకిచ్చేందుకు ఇన్ని వేధింపులా? తాయిలాలిచ్చేందుకు పథకాలు అమలుచేసేందుకు డబ్బులెక్కడివి. విసిగివేసారి కొందరు హైకోర్టుకు వెళ్తే ఒకరిద్దరికి మాత్రమే చెల్లించారు. మిగతా వారు కేసులు వేస్తే ఇవ్వడం లేదు. ఆఖరుకు కోర్టు ధిక్కరణ కేసు వేసినా ఇవ్వకుండా మొండికేస్తున్నారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మేమెప్పుడు చూడలేదు. మొద్దునిద్రలో ఉన్న సర్కారును మేల్కొలిపేందుకే మహాధర్నా తలపెట్టాం. పెన్షనర్లంతా తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తలపెట్టిన పెన్షనర్ల మహాధర్నా విజయవంతం చేయాలని తెలంగాణ పెన్షనర్స్ ఫోరం కన్వీనర్ రఘునందన్ పిలుపు ఇచ్చారు. పెన్షనర్స్ జేఏసీ తలపెట్టిన ధర్నాను పెన్షనర్లంతా విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే జేఏసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతంచేస్తామని హెచ్చరించారు.