తెలంగాణచౌక్, అక్టోబర్ 21: దేశ స్వాతంత్య్ర పోరాటంతో సంబంధంలేని బీజేపీకి దేశాన్ని పాలించే అర్హత లేదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్ నాయకులు గాడ్సే వారసులని నిప్పులు చెరిగారు. కేంద్రం పాలనను గాలికి వదిలి మతవిద్వేషాలు సృష్టిస్తూ పబ్బంగడుపుతున్నదని విమర్శించారు. శనివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నదని ఆరోపించారు.
అదానీ ఆదాయంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా వాటాలు పంచుకుంటున్నారని మండిపడ్డారు. ఏటా కోటి ఉద్యోగాల హామీని తుంగలో తొక్కి యువతకు నిరాశను మిగిల్చిందని విమర్శించారు. రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రతోనే జనగణన చేపట్టడంలేదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం బీసీలకు 52 శాతం, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు నవంబర్ 4న కరీంగనర్‌లో నిర్వహించే ప్రజాగర్జన సభకు అన్నివర్గాలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.