హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఆశావర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రజలకు వైద్యసేవలందించే ఆశా వర్కర్లకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? తమ సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్ఛ లేదా? అని ఎక్స్ వేదికగా సోమవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు క్షేత్రస్థాయిలో సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆశాలకు గౌరవ వేతనంగా ఉన్న రూ.1,500ను కేసీఆర్ రూ.10 వేలకు పెంచి వారి సేవలను గుర్తించి గౌరవించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా హామీలను నెరవేర్చకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
సోనియా పుట్టినరోజు కానుక ఇదేనా?: కవిత
ఎన్నికల హామీలను అమలు చేయాలని అడిగిన ఆడబిడ్డలను పోలీసులతో కొట్టిస్తారా? ఇదేనా సోనియాగాంధీ తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే పుట్టినరోజు కానుక? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఆనాడు ఉద్యమ సమయంలో ఉన్న నిర్బంధాలు, అణచివేతలకు రేవంత్‌రెడ్డి పాలన ఏమాత్రం తీసిపోలేదని ఆమె ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలకు రూ.18 వేల జీతం ఇస్తామన్న హామీని అమలు చేయాలని శాంతియుత నిరసన తెలిపిన ఆశా వర్కర్లను అమానుషంగా కొడుతూ పోలీస్ వ్యాన్ ఎక్కించిన తీరు నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదు.. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో, బతుకమ్మ ఆడే చేతులతోనే కాంగ్రెస్ నిరంకుశ పాలనకు ఆడబిడ్డలు చరమగీతం పాడటం ఖామమని హెచ్చరించారు.
ఆశాలపై దాడి సిగ్గుచేటు: సబితా ఇంద్రారెడ్డి
ఆశా వర్కర్లపై పోలీసులతో దాడి చేయించడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సిగ్గుచేటని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆమె తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో తెలంగాణతల్లి ఆడబిడ్డలకు ప్రతిరూపమని చెప్పిన రేవంత్‌రెడ్డి… బయట మాత్రం ఆడబిడ్డలైన ఆశా వర్కర్ల మీద దాడి చేయించారని మండిపడ్డారు. హామీని నెరవేర్చాలని అడిగినందుకు మగ పోలీసులు ఆశావర్కర్ల చీరలు పట్టుకుని లాగుతారా? అని నిలదీశారు. ఆశా వర్కర్ల జీతాన్ని రూ.18 వేలకు పెంచుతామన్న హామీని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన సంతోషకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.
ఆశావర్కర్లపై మగ పోలీసుల దౌర్జన్యమా?: సునీతా లక్ష్మారెడ్డి
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లపై మగ పోలీసులు దౌర్జన్యం చేయడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ దాడేనని విమర్శించారు. హామీలను అమలు చేయాలని అడిగిన ఆశా వర్కర్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆశా కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఆశా వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.