Indiramma Illu | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): పేదల ఇండ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడినట్టు కనిపిస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లపై సర్కార్ చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతనలేకుండా పోయింది. అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం.. అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ప్రజలతో వెటకారంగా మాట్లాడుతూ… పరాచికాలు ఆడుతున్నదని విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.
ప్రజలే ప్రభుత్వ భూములను గుర్తించి ప్రభుత్వానికి చెప్తే… వాటిని ఇండ్ల కోసం కేటాయిస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం శాసనసభలో చెప్పడం అత్యంత దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. స్థలాలను గుర్తించి ఇండ్లు మంజూరు చేయాల్సిన సర్కార్ పెద్దలు… ప్రజలే స్థలాలు గుర్తించాలని అనడం బాధ్యతారాహిత్యమని విపక్షాల నేతలు మండిపడుతున్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై నిప్పులు చెరుగుతున్నారు. 20 లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్టు సభలో గొప్పలు చెప్పిన మంత్రి… స్థలాల కొరతను సాకుగా చూపడం దారుణమని విరుచుకుపడుతున్నారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా, ఒక్క ఇంటి నిర్మాణం కూడా మొత్తం పూర్తి చేయని కాంగ్రెస్ సర్కార్… లక్షలకొద్దీ ఇండ్లు మంజూరు చేస్తామంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదని తేల్చిచెప్తున్నారు.
దరఖాస్తులు 79 లక్షలు, కడుతున్నవి 2.5 లక్షలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ అంటూ హడావుడి చేసింది. అర్హులైన అందరికీ ఇండ్లు ఇస్తామని ఊదరగొట్టింది. ఆరు గ్యారెంటీల అమలుపై ఆశలు పెట్టుకున్న 79,34,798 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నుంచి 20 లక్షల మంది అర్హులను గుర్తించామని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. కానీ 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేసింది. వీరిలోనూ 3.69 లక్షల మంది లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించింది. ఇందులో గ్రౌండింగ్ అయినవి కేవలం 2.45 ఇండ్లు. ఇందిరమ్మ కమిటీల్లోని కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా ఎంపిక చేసిన వారి దరఖాస్తులను కేంద్రం తిరస్కరించింది. ఇలా సుమారు 20 వేలకుపైగా ఇందిరమ్మ లబ్ధిదారులను.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అనర్హులుగా తేల్చింది. కొందరికి ఇండ్లు మంజూరైనా.. స్థల విస్తీర్ణంలో ప్రభుత్వం పెట్టిన కొర్రీలతో కట్టుకోవడంలేదు. బిల్లుల మంజూరులో జాప్యం, అక్రమాలు, వసూళ్ల దందాతో మరికొందరు విసిగివేసారి నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల సంఖ్య 2 లక్షల లోపు మాత్రమేనని అధికారుల అంచనా.
పట్టణ పేదలను పట్టించుకుంటనే లేరు
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో పట్టణ, నగర పేదలకు ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి పెద్ద నగరాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అసాధ్యమని అధికారవర్గాలే స్పష్టంచేస్తున్నాయి. పట్టణ పేదల కోసం కేంద్రం నిరుడు ఏప్రిల్‌లో పీఎంఏవై (అర్బన్) కింద రూ.1,705 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 1.13 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.1,500 కోట్లు మంజూరు చేసింది. ఇండ్ల నిర్మాణంలో పురోగతి ఆధారంగా కేంద్రం దశలవారీగా విడుదల చేస్తుంది. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం పట్టణాల్లో ఒక్క ఇంటిని కూడా చేపట్టకపోవడంతో కేంద్రం మంజూరు చేసిన నిధులను వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ఇండ్ల కోసమూ… రుణాలో రామచంద్రా!
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు సకాలంలో బిల్లులు మంజూరు చేయడంలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హడ్కో నుంచి తీసుకొచ్చిన రుణాలతో లబ్ధిదారులకు ఇంతకాలం చెల్లింపులు చేస్తూ వచ్చింది. ఇలా ఇప్పటివరకు రూ.2,233 కోట్లు ఇచ్చింది. ఇండ్ల నిర్మాణంలో పురోగతి లేకపోవడంతో తదుపరి రుణాలు లభించే ఆస్కారంలేదని అధికారులు చెప్తున్నారు. పీఎంఏవై కింద నిధులు వస్తేనే తదుపరి బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. రెండేండ్లలో అసమర్థ విధానాలతో రాష్ర్టాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన కాంగ్రెస్ సర్కార్.. పేదలను మభ్యపెట్టేందుకు అడ్డగోలుగా హామీలతో కాలయాపన చేస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి.
పుస్తెలమ్మి కడుతున్న
ఈ చిత్రంలో ఉన్నవారు బండ బాలమణి శ్రీనివాస్ దంపతులు. అధికారులు ఇల్లు మంజూరైందని చెప్పి ప్రొసీడింగ్‌లో భర్త పేరు పేర్కొనకుండానే అందించారు. అధికారులు ముగ్గులు పోయగా, బాలమణి తన మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తెల తాడును అమ్మి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్న తర్వాత మొదటి బిల్లు రాకపోవడం, రెండో విడుతలో వస్తాయనుకొని మరో రూ.2 లక్షలు అప్పు చేసి స్లాబ్ వరకు పూర్తి చేసుకున్నారు. బిల్లు కోసం మూడు నెలల నుంచి అధికారుల చుట్టూ తిరుగగా, బిల్లు అదే గ్రామానికి చెందిన దరఖాస్తే చేసుకోని బండ బాలమణి భర్త బాలయ్య ఖాతాలో జమైనట్టు తేలగా లబోదిబోమంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అసలు మీకు ఇల్లే మంజూరు కాలేదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-ముస్తాఫానగర్, గంభీరావుపేట
రోడ్డున పడేసిన్రు..
మాది ముస్తాఫానగర్. మేము ఒడ్డెరులం. పూరి గుడిసెలో నివసిస్తూ కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నాం. నా పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని కలెక్టర్ స్వయంగా నా చేతికి ప్రొసీడింగ్ ఇవ్వడంతో గుడిసెను తొలగించినం. అదే జాగలో పంచాయతీ కార్యదర్శి వచ్చి జూన్‌లో ముగ్గు పోసిండు. లక్ష రూపాయల అప్పుచేసి పనులు మొదలు పెట్టినం. బేస్మెట్ దాకా కట్టుకున్నం. మొదటి బిల్లు వత్తలేదని అధికారుల చుట్టు మూన్నెళ్ల నుంచి తిరిగుతుంటే మా ఇంటి స్థల రికార్డు పేపర్లు సరిగాలేవని, ఇల్లు మంజూరు కాలేదని ఇప్పుడు అంటున్నరు. ఏం చేయాలో అర్థమైతలేదు. ప్రొసీడింగ్ ఇవ్వకున్నా అట్లనే గుడిసెలో ఉండెటోళ్లం. ఇప్పుడు మా బతుకు రోడ్డున పడ్డది. లక్ష రూపాయలు నష్టపోయినం. మళ్లీ బేస్మెంట్ పక్కన గుడిసె వేసుకుని నలుగురు పిల్లలతో తల దాచుకుంటున్నం.
– సూర సంతోషి, గంభీరావుపేట