హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలను మంజూరుచేసిందని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ర్టానికి 21 నవోదయ విద్యాలయాలు మంజూరుచేయాలని కోరితే ఏడు మాత్రమే ఇచ్చినట్టు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం కేటాయించాలని కేంద్ర మంత్రులకు పలుమార్లు లేఖలు రాసినట్టు గుర్తుచేశారు. ఈ విషయంపై పార్లమెంటు సమావేశాల్లోనూ కేంద్రానికి ప్రశ్నలు సంధించినట్టు చెప్పారు. అప్పటి సీఎం కేసీఆర్ సైతం ప్రధానికి లేఖ రాసినట్టు తెలిపారు. తాను ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే నవోదయ విద్యాలయాల కోసం పోరాడినట్టు నామా వెల్లడించారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తంచేసినట్టు తెలిపారు. నూతన నవోదయ విద్యాలయాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు.
జేఎన్వీల కేటాయింపును స్వాగతిస్తున్నాం: వినోద్‌కుమార్
తెలంగాణకు ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల కేటాయింపును స్వాగతిస్తున్నట్టు మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో జేఎన్వీలు ఏర్పాటుచేయాలనే డిమాండ్ పదేండ్లుగా పెండింగ్ ఉన్నదని, తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల పిల్లలకు మెరుగైన విద్య అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లోనూ విద్యాలయాలు ఏర్పాటుచేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను కోరారు.