హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): సింగరేణిది 137 ఏండ్ల ఘన చరిత్ర. దక్షిణాదిలో విస్తరించిన అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో, 350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. 600 మీటర్ల లోతు నుంచి బొగ్గును వెలికితీయగలిగిన నైపుణ్యం దాని సొంతం. 17 ఓపెన్ కాస్టులు, 22 భూగర్భగనులు, 42 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న సంస్థ. ఏడాదికి 69-70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. ఏటా కనీసం రూ.6,000 కోట్ల లాభాలు ఆర్జిస్తుంది. దాదాపు రూ.38వేల కోట్ల వార్షిక టర్నోవర్. కొత్తగా సంస్థకు అనుబంధంగా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, గ్లోబల్ లిమిటెడ్ కంపెనీలు జతకూడాయి.
అంతర్జాతీయంగా ఐదు దేశాలు, జాతీయంగా 10 రాష్ర్టాలకు విస్తరించే భారీ ప్రణాళికలు. ఆఖరుకు బంగారం అన్వేషణ లైసెన్స్ కూడా పొందిన ఘనత. ఇంతటి ప్రాశస్త్యం.. గొప్ప చరిత్ర గల సింగరేణి సంస్థ నైని ఓపెన్‌కాస్టును ఎందుకు వదులుకున్నది. వందల మీటర్ల లోతు నుంచి బొగ్గును వెలికితీసిన కంపెనీ పది మీటర్లలోతు నుంచి బొగ్గును వెలికతీయలేక చేతులెత్తేసిందా? వేల కోట్ల రూపాయల టర్నోవర్ గల సంస్థ ఓ బొగ్గుగని కోసం కేవలం రూ.1,600 కోట్లు ఎందుకు ఖర్చుపెట్టలేకపోయింది? 350 కిలోమీటర్ల విస్తీర్ణంలోని బొగ్గు నిక్షేపాల్లో పనిచేస్తున్న సంస్థ కేవలం రెండు వేల ఎకరాల్లోని కోల్బ్లాక్పై ఎందుకు హ్యాండ్సప్ అన్నది.
పది మీటర్లలోతులోని బొగ్గు తీసే సామర్థ్యాలు సంస్థకు లేవా? లేక దీని వెనుక ఎవరిదైనా ఒత్తిడి ఉన్నదా? మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీవో) విధానంలో ఔట్‌సోర్సింగ్‌కు ఎందుక్విబోతున్నది. ప్రైవేట్ సంస్థలకు ఎందుకు కట్టబెట్టబోతున్నది. అన్ని రకాల హంగులు, వనరులు, కార్మికులున్నా సింగరేణి ఎందుకు అస్త్రసన్యాసం చేసింది? ఇవి నైని కోల్‌బ్లాక్ విషయంలో సింగరేణి కార్మికలోకం సంధిస్తున్న ప్రశ్నలు.
సింగరేణి గత 137 ఏండ్లుగా బొగ్గును ఉత్పత్తి చేసి, విక్రయిస్తున్నది. కానీ ఇప్పుడు కొత్తగా ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి బొగ్గును కొనుగోలు చేయనున్నది. అది కూడా తనకు కేటాయించిన బొగ్గు గనిని ఇతరుల చేతుల్లో పెట్టి, వారి నుంచి బొగ్గును కొనబోతున్నది. ఉత్పత్తి, విక్రయాల్లో అపార అనుభవం గల సంస్థ ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర బొగ్గు కొనుగోలు చేసే స్థితికి దిగజారడమేంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎండీవో విధానంలో నైనిబ్లాక్ను దక్కించుకున్న సంస్థ పెట్టుబడి పెట్టి, యంత్రాలు సమకూర్చుకుని, బొగ్గును వెలికితీయాలి. ఇలా తీసిన బొగ్గును.. సింగరేణి టన్నుకు కొంత చెల్లించి కొనుగోలు చేయాలి.
కొన్న బొగ్గును సింగరేణి ప్రైవేట్‌కు విక్రయించరాదు. ధర ఎక్కువ పెడతామన్నా ఇచ్చేందుకు వీల్లేదు. అయితే ఈ బొగ్గును తన సొంత అవసరాలకు వాడుకోవాలి. లేదంటే ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే విక్రయించాలి. ఇంతగా దిగజారడమెందుకుని కార్మిక సంఘాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అంటే సంస్థ భవిష్యత్తును పణంగా పెట్టబోతున్నారా? అంటూ నిలదీస్తున్నాయి.
నైని బొగ్గును కాంట్రాక్టర్ నుంచి సింగరేణి టన్నుకు రూ.1600 పెట్టి కొనుగోలు చేసిందనుకుంటే ఆ బొగ్గును రూ.2,000 లేదా రూ.2,500కు సింగరేణి విక్రయిస్తుంది. అంటే సింగరేణి దళారిగా మారిపోతుంది. ఇంతలా సంస్థను దిగజార్చడమేంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రేపు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సింగరేణికి బొగ్గును విక్రయించను, లేదంటే ధర గిట్టుబాటు కావడంలేదు. ఫలానా ధరకే బొగ్గు ఇస్తానంటే.. సింగరేణి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలొస్తున్నాయి.
నైని కోల్‌బ్లాక్ విస్తీర్ణం 2,200 ఎకరాలు. ఇప్పటికే 200 ఎకరాల్లో ఏపీకి చెంది ఓ సంస్థ ఓవర్‌బర్డెన్‌ను వెలికితీస్తున్నది. సింగరేణి సంస్థ సైతం 80 వేల టన్నుల బొగ్గును వెలికి తీసింది. మిగిలిన రెండు వేల ఎకరాలను సింగరేణి ఎందుకు చేపట్టలేకపోతున్నదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ బ్లాక్ నుంచి 40 ఏండ్ల వరకు బొగ్గు వెలికి తీయవచ్చని, 340 మిలియన టన్నుల వరకు ఉత్పత్తి చేయవచ్చని ఓ అంచనా. పైగా పది మీటర్లలోతులోనే జీ10 గ్రేడ్ అంటే నాణ్యమైన బొగ్గు లభ్యమవుతున్నది. సింగరేణిలో ప్రస్తుతం జీ15- జీ14 గ్రేడ్ బొగ్గు దొరుకుతుండగా నైనిలో జీ10 గ్రేడ్ బొగ్గు లభ్యమవుతుంది.
వందల మీటర్ల లోతు నుంచి నాసిరకం బొగ్గు తీసిన సంస్థ పది మీటర్ల లోతు నుంచి నాణ్యమైన బొగ్గును వెలికితీసే బాధ్యతలను ఎందుకు చేపట్టలేకపోతున్నదని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక నైని కోల్‌బ్లాక్ కోసం సింగరేణి దాదాపు రూ.500 కోట్లు ఖర్చుచేసింది. ప్రైవేట్‌కు ఇచ్చే ఆలోచనే ఉంటే.. ఇంత మొత్తం ఎందుకు పెట్టుబడి పెట్టారని నిలదీస్తున్నాయి. అయితే గతంలో టెండర్‌కు వెళ్లినప్పుడు ప్రాజెక్ట్ వ్యయం రూ.1,300 కోట్లే కాగా, ఇప్పుడు దానిని రూ.1600 కోట్లకు పెంచారు. ఈ రూ.300 కోట్ల పెంపు వెనుక మతలబేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకొని, సింగరేణి సంస్థనే ఈ ప్లాంట్‌ను చేపట్టాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
నైని కోల్‌బ్లాక్ నుంచి వెలికితీసిన బొగ్గును సింగరేణి సంస్థనే వినియోగించుకోవాలి. ఈ బొగ్గును జైపూర్‌లో సింగరేణి థర్మల్‌ప్లాంట్‌కు కేటాయించారు. అయితే నైనిలో 1600 మోగావాట్ల థర్మల్ ప్లాంట్లు నిర్మించే యోచనలో సింగరేణి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు కొత్తగా తమిళనాడు జెన్కో చేరింది. ఏటా 2.88 మిలియన్ టన్నుల నైని బొగ్గు సరఫరాకు కొంతకాలం క్రితం తమిళనాడు జెన్కోతో సింగరేణి ఒప్పందం కూడా చేసుకుంది.
తూత్తుకుడి జిల్లాలోని ఉండింగిలో 1,200 మోగావాట్ల థర్మల్‌ప్లాంట్‌కు ఈ బొగ్గును అందించనుంది.అయితే క్యాప్టివ్ మైన్ నుంచి వెలికితీసిన బొగ్గును సొంత అవసరాలతోపాటు, ప్రభుత్వరంగ సంస్థలకు విక్రయించే వెసులుబాటు ఉండటంతోనే తమిళనాడు జెన్కో ఒప్పందం చేసుకున్నట్టు సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. ఏదీ ఏమైనా నైని కోల్‌బ్లాక్ రోజుకో కొత్త వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.