హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి ప్రతి విద్యార్థికి ఒక జత యూనిఫాం ఇవ్వాలి. ఇది తెలంగాణ విద్యాశాఖ నిర్దేశించుకున్న లక్ష్యం. కానీ, ఈ లక్ష్యం నెరవేరే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడంలేదు. జూన్ 12న విద్యార్థులకు యూనిఫారాలు అందడం కష్టంగానే కనిస్తున్నది. రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం 21 లక్షల మంది విద్యార్థులకు తలా రెండు జతల యూనిఫారాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు 90,86,997 మీటర్ల వస్ర్తాన్ని టెస్కో సంస్థ ద్వారా సేకరించారు. పలు జిల్లాల్లోని మండలాలకు యూనిఫామ్ వస్త్రం చేరింది. ఒక్కో జతకు కుట్టుకూలి రూ.50 మాత్రమే ఇస్తుండటంతో కుట్టేందుకు దర్జీలు ముందుకు రావడం లేదు. జగిత్యాల జిల్లాలో ఓ మండల పాయింట్ వద్దకు వస్త్రం చేరింది. స్కూళ్లకు ఇంకా చేరలేదు. ఈ సారి మొత్తం యూనిఫారాలు కట్టించే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లోని మహిళా సంఘాలకు అప్పగించారు. గతంలో దర్జీలకు కొంత, మహిళా సంఘాలకు మరికొంత ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు మొత్తం మహిళా సంఘాలకే అప్పగించారు. మహిళా సంఘాలను గుర్తించే బాధ్యతను పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు అప్పగించారు. ఈ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 30 వేల సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు యూనిఫారాలు కుట్టించే బాధ్యతలు అప్పగించింది. యానిఫారాల కుట్టుకూలి తక్కువగా నిర్ణయించడంతో మహిళా సంఘాలు సైతం ఆసక్తి చూపడంలేదు. జగిత్యాల జిల్లాలోని ఓ స్కూళ్లో మహిళా సమాఖ్య సభ్యులు పిల్లలందరినీ పిలిపించి కొలతలు తీసుకుంటున్నట్టు ఫొటోలు తీసుకుని వెళ్లారు. మహిళా సంఘాలు ముందుకు రాకపోవడంతో వారి నుంచి అభ్యంతరం లేదని డిక్లరేషన్ తీసుకుని బయట దర్జీల చేత కుట్టించాలని విద్యాశాఖ అధికారులు ఇటీవలే ఆదేశాలిచ్చారు.
పుస్తకాలు కూడా..
రాష్ట్రంలోని సర్కారు స్కూళ్ల విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు ఇప్పుడిప్పుడే జిల్లాలకు చేరుతున్నాయి. శనివారం వరకు 78 శాతం పుస్తకాలు జిల్లాలకు చేరాయి. మిగతా పుస్తకాలు జూన్ మొదటి వారంలో చేరే అవకాశమున్నది. తొలివిడతలో అందించే పార్ట్-1 పుస్తకాలు ఇప్పటి వరకు వికారాబాద్ జిల్లాకు 69 శాతం, మహబూబ్నగర్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు 72, నారాయణపేట జిల్లాకు 70 శాతం మాత్రమే చేరాయి. ఈ విద్యాసంవత్సరంలో 25,80,291 విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తంగా 1.90 లక్షల పుస్తకాలు విద్యార్థులకు అందించాల్సి ఉన్నది. మొదటి విడుతలో పార్ట్-1 పుస్తకాలు అందిస్తున్నారు. ఇలా 1,43,11,141 పుస్తకాలను విద్యార్థులకు అందించేందుకు ముద్రించారు. వీటిలో ఇప్పటి వరకు 1,10,91,460 పుస్తకాలు జిల్లాలకు చేరాయి. ఇక రెండో విడుతలో పార్ట్ -2 పుస్తకాలను ఆగస్టులో అందించేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తున్నది.