న్యూస్‌నెట్‌వర్క్, జూన్ 13 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడి బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి పదుల సంఖ్యలో రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు విరిగిపడి విద్యుత్తు సరఫరాకు, ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ నగరంతోపాటు నర్సంపేటలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల, వెంకటాపూర్ గ్రామాల్లో గాలిదుమారానికి భారీ నష్టం సంభవించింది.
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన పిడుగుల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామంలో ఈదురు గాలుల బీభత్సానికి మూడు కరెంట్ స్తంభాలు నేలకూలాయి. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం రామాతీర్థం సబ్‌స్టేషన్‌లో పిడుగు పడింది. దీంతో పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో పగుళ్లు వచ్చి కొంత ఆయిల్ లీకేజీ అయ్యింది. శివ్వంపేట మండలం లింగోజిగూడ దొంతి లక్ష్మయ్యకు చెందిన 5000 కోళ్ల సామర్థ్యం కలిగిన పౌల్ట్రీ ఫాం కుప్పకూలింది. అందులోని కోళ్లు, కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొణిజర్ల మండలంలో రికార్డు స్థాయిలో 68.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోనకల్ 53.3 మి.మీ, మధిర 52.8 మి.మీ, ఖమ్మం అర్బన్ 51.5 మి.మీ, చింతకాని 50 మి.మీ, రఘునాథపాలెం 46.8 మి.మీ, ఖమ్మం రూరల్ మండలంలో 26 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.