హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని 30 ప్రాంతాల్లో సుమారు 40 బృందాలతో ఐటీ (ఇన్‌కం ట్యాక్స్) అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని అన్విత బిల్డర్స్ కార్పొరేట్ కార్యాలయాలపై ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తున్నది. సోదాల్లో భాగంగా ఆయా కంపెనీలలో పనిచేస్తున్న సిబ్బందిని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అన్విత బిల్డర్స్ అధినేత బొప్పన అచ్యుత్‌రావు, బొప్పన శ్రీనివాసరావు, బొప్పన అనూప్ ఇండ్లల్లో, వారి సన్నిహితుల, వారి కంపెనీలలో పనిచేసే కీలక ఉద్యోగుల ఇండ్లల్లోనూ తనిఖీలు చేపట్టినట్టు తెలిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జూబ్లీహిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్‌పేట్, ఏపీలోని కొల్లూరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగాయి. పన్ను ఎగవేత, లెకల్లో నగదు చూపకపోవడం, అన్విత బిల్డర్స్ నుంచి విదేశాలకు నిధులు మళ్లించారనే కారణాలతో జరిగిన ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చైతన్యపురిలోని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయంలోనూ ఐటీ సోదాలు జరిగినట్టు గురువారం ప్రచారం జరిగింది. ఈ గూగీ ప్రాపర్టీస్, డెవలపర్స్ సంస్థ అధినేత షేక్ అక్బర్ కాంగ్రెస్ నాయకుడు కావడం గమనార్హం. గూగీ ప్రాపర్టీస్ కార్యాలయాలపై ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని ఆ సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): డీవోపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి రిలీవ్ అయిన నలుగురు ఐఏఎస్ అధికారులు గురువారం ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేశారు. డీవోపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో ఆమ్రపాలి కాట, రొనాల్డ్‌రోస్, వాణీప్రసాద్, వాకాటి కరుణ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ను కలిసి రిపోర్టు చేశారు. కేంద్రం ఈ నెల 9న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆలిండియా సర్వీసు అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాల్సిందేనంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని ఆపాలని కోరుతూ తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ ఇచ్చిన ఉత్వర్వుల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు తేల్చిచెప్పడంతో ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు.