Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. బొగ్గుగనుల కుంభకోణంలో తన అనుయాయుల పేర్లు తెరమీదకు రావడం.. అమాత్యుల పంచాయితీ రచ్చకెక్కడం.. ఆ అంశాలపై ప్రజల్లో విపరీతమైన చర్చ కొనసాగుతుడటంతో మరోసారి డైవర్షన్ అస్ర్తాన్ని ప్రయోగించారు. ప్రజలను ఏమార్చేందుకు, దృష్టి మరల్చేందుకు సిద్ధమయ్యారు. అవినీతిపై సర్కార్‌ను నిలదీస్తున్న, ప్రజల్లో చర్చ పెడుతున్న బీఆర్ఎస్ నేతలను వేధించేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగానే తాజాగా మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు అందించినట్టుగా స్పష్టమవుతున్నది.
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు సోమవారం రాత్రి సిట్ నోటీసు ఇచ్చింది. ఆయన ఇంట్లో లేని సమయంలో నానక్‌రామ్‌గూడలోని నివాసంలో అంటెండర్‌కు నోటీస్ అందజేసింది. పంజాగుట్టలో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 యూ/సెక్షన్.166, 409, 427, 201, 120 (బీ) ఆర్/డబ్ల్యూ, 34 ఐపీసీ, పీడీపీపీ యాక్ట్‌లోని సెక్షన్ 3, ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 65, 66, 66 (ఎఫ్)(1)(బీ)(2), 70 ఆధారంగా విచారణకు హరీశ్‌ను పిలిచారు. ‘ఈ కేసులో ఇప్పటి వరకూ జరిగిన విచారణలో మీకు కొన్ని వాస్తవాలు, పరిస్థితుల గురించి తెలిసినట్లు వెల్లడైంది. కాబట్టి ఈ నోటీసు అందిన వెంటనే, తదుపరి విచారణ నిమిత్తం ఈనెల 20న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరుకావలసిందిగా కోరడమైనది’ అంటూ సిట్ అధికారి వెంకటగిరి పేరుతో నోటీస్ ఇచ్చారు.
ఇరకాటంలో సర్కార్.. అందుకే డైవర్షన్!
ఇటీవల ఓ మంత్రిపై ప్రముఖ చానల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. అదే సమయంలో వేరొక వార్తపత్రిక మరో అమాత్యుడిపై సంచలన ఆరోపణలకు దిగింది. ఈ ఉదంతంలో నైని బొగ్గుగనుల కుంభకోణం వెలుగు చూసింది. వాటాల పంపకాల్లో తేడాల వల్లే అమాత్యులు తమ అనుకూల మీడియాలో పరస్పర కథనాలను రాయించుకున్నారని జోరుగా చర్చ జరుగుతున్నది. ఈ ఉదంతంలో అటు ఐఏఎస్‌లను రచ్చకీడ్చారు. మరోవైపు జర్నలిస్టులను బలిచేశారు. ఆ విషయంలోనూ ప్రభుత్వం పరువు గంగలో కలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే అంశంపై తీవ్ర చర్చ నడుస్తున్నది. ఐఏఎస్‌లపై కథనాలు, జర్నలిస్టు అరెస్టులను హరీశ్ తీవ్రంగా వ్యతిరేకించారు. జర్నలిస్టులకు మద్దతుగా మాట్లాడుతూ ‘సజ్జనార్.. కాంగ్రెస్ కండువా కప్పుకో’ అని నిలదీశారు. ఇదే తరుణంలో బొగ్గు గనుల కుంభకోణంపై సర్కార్‌ను నిలదీస్తూ ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. సోమవారం ఉదయమే హరీశ్‌రావు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసమే సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ సిస్టం తొసుకొచ్చారని, సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన కంపెనీ శోధాకే తొలి టెండర్‌ను కట్టబెట్టారని, ఆ కంపెనీకి అనుచిత లబ్ధి జరిగిందని బయటపెట్టారు.
దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కుంభకోణానికి సంబంధించి అన్ని ఆధారాలు బయటపెడతామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించారు. దీంతో రేవంత్ సర్కార్ పూర్తిగా ఇరకాటంలోనే కాదు.. దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అవినీతిని కప్పిపుచ్చుకోలేక, ప్రతిపక్ష బీఆర్ఎస్కు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అనుకూల టీవీ చానళ్లు, పత్రికల కథనాలతో అసలు విషయాన్ని పక్కదోవ పట్టించాలనుకున్న ప్రభుత్వ పెద్దల పన్నాగం ఒక్కసారిగా బెడిసికొట్టింది. దీంతో డైవర్షన్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం సిట్ నోటీసు పేరుతో కక్ష సాధింపునకు దిగింది. సుప్రీంకోర్టు కొట్టేసిన ఫోన్ ట్యాపింగ్లోనే మరోసారి హరీశ్‌రావుకు సిట్ నోటీసులు అందించడమే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ‘ఫోన్ ట్యాపింగ్ ఓ కల్పిత కథ.. ఇంకెన్ని రోజులు విచారిస్తరు’ అని ఇప్పటికే సుప్రీంకోర్టు తప్పుబట్టింది.ఈ కేసులో ప్రభాకర్‌రావు బెయిల్ పై విడుదలయ్యారు. అసలు ఏమీ లేని కేసులో హరీశ్‌ను విచారణ పేరిట కాంగ్రెస్ సర్కార్ వేధింపులకు గురిచేస్తున్నదని, హరీశ్ ఉదయం ప్రెస్‌మీట్ పెట్టగా.. సాయంత్రం తిరిగేసరికే నోటీసులు అందించడమే ఇందుకు నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పైగా ట్యాపింగ్ వ్యవహారాల అధికార పరిధి ఉండే మంత్రిత్వ శాఖలను హరీశ్ ఎన్నడూ నిర్వహించలేదు.
ఇవ్వన్నీ ఇలా ఉండగా కాంగ్రెస్ అంతర్గత పోరు సైతం ఇటీవల తీవ్రతరమైంది. మంత్రివర్గం వివాదాల్లో కూరుకుపోవడం, కాంగ్రెస్ శ్రేణుల భూముల దందాలు, బ్లాక్‌మెయిలింగ్ అంశాలన్నీ గత వారం రోజులుగా తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ప్రజల్లో విపరీత చర్చ కొనసాగుతున్నది. వాటన్నింటినీ దారిమళ్లించేందుకు మరోసారి నోటీసుల డ్రామాకు రేవంత్‌రెడ్డి సర్కార్ తెరతీసింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భాల్లోనే ఇలాంటి ఉదంతాలు, డైవర్షన్ రాజకీయాలకు తెరలేవడం గమనార్హం.
బీఆర్ఎస్ ఆగ్రహం
ట్యాపింగ్ కేసులో హరీశ్‌కు సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటీసులిచ్చి కేసుల పేరిట వేధిస్తున్నదని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో హరీశ్‌తో కలిసి కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
తెలంగాణ భవన్ నుంచే విచారణకు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన విచారణకు హరీశ్‌రావు హాజరుకానున్నారు. నేడు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ మేరకు హరీశ్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
తప్పుడు కేసులతో ఎన్నాళ్లు వేధిస్తారు?: సిరికొండ
తప్పుడు కేసులు బనాయించి హరీశ్‌రావును వేధించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నదని, తప్పుడు కేసులతో ఎన్నాళ్లు వేధిస్తారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వ పెద్దల వ్యక్తిగత అభీష్టాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని, పోలీసు మాన్యువల్ ప్రకారం పనిచేయాలని హితవు చెప్పారు. ఫోన్‌ట్యాపింగ్ పేరుతో నాటి బీఆర్ఎస్ సర్కార్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ కేసు చట్టం, న్యాయం ముందు ఏమాత్రం నిలబడదని పేర్కొన్నారు. హరీశ్‌రావుకు ఫోన్‌ట్యాపింగ్‌తో ఏమాత్రం సంబంధంలేదని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో విస్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు.
పూటకో డ్రామా..
గడచినా 24 నెలలుగా ప్రభుత్వం ఇరకాటంలో పడిన ప్రతి సందర్భంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరతీస్తూనే ఉన్నారు. 420 హామీలతో గద్దెనెక్కి ఇప్పటికీ ఏ ఒక్కటీ అమలు చేయలేక ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికీ సరిగా యూరియా అందించక రైతులను అరిగోస పెడుతున్నారు. బోనస్, రైతుబంధు కోసం అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వాటన్నింటి నుంచి తప్పించుకునేందుకు, ప్రజలను ఎప్పటికప్పుడు ఆ విషయాల మీద నుంచి దృష్టి మరల్చేందుకు రేవంత్ ప్రభుత్వం అప్పటికప్పుడు ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకువస్తూనే ఉన్నది. సరార్ పరువు బజారున పడ్డ ప్రతిసారీ పసలేని అంశాలను తెరపైకి తెస్తూనే ఉన్నది. కాళేశ్వరం కమిషన్ల పేరిట కొద్దికాలం, ఫార్ములా ఈ రేస్ అంటూ ఓసారి, ఫోన్ ట్యాపింగ్ అని మరోసారి డ్రామాలు ఆడుతూనే వస్తున్నది.