హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ సమావేశాలు, వివిధ సందర్భాల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చేసిన వినతులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు శుక్రవారం ఎంపీ వద్దిరాజుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి జితిన్ ప్రసాద లేఖ రాశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్), గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, రైల్వే డివిజన్ మంజూరు కోసం గతంలో పార్లమెంట్ జీరో అవర్లో ప్రస్తావించారు. ఆయా శాఖల మంత్రులకు వినతిపత్రాలు అందించి వీటి అవశ్యకతను వివరించారు. ఎంపీ రవిచంద్ర సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని ఆయా మంత్రిత్వ శాఖలు ప్రత్యుత్తరం రాశాయి.