హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎక్సైజ్ ఆదాయాన్ని సుమారు రూ.7 వేల కోట్లకు ఎలా పెంచుతారో అసెంబ్లీకి వివరించలేక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తడబడ్డారు. ఎక్సైజ్ విభాగం పద్దుల సందర్భంగా సోమవారం అర్ధరాత్రి సభలో విస్తృత చర్చ జరిగింది. మద్యంపై ఆదాయాన్ని పెంచి రాష్ర్టాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేయొద్దని విపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. ప్రజలకు అధికంగా మద్యాన్ని తాగించే విధానమే మీదైతే.. ఆబ్కారీ శాఖలోని ‘ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్’లో మద్య నిషేధం అనే పదాన్ని పూర్తిగా తొలగించుకొని రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముకోండిని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ గల్లీలో చూసినా బెల్టుషాపు దర్శనమిస్తున్నదని, వాటిని ఎప్పటినుంచి ఎత్తివేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలు మంచివికావని ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ సభ్యులు హితవు పలికారు. వివాదస్పద సోం డిస్ట్రిలరీస్కు తెలంగాణలో అనుమతులు ఇవ్వడంపై సభలో చర్చ జరిగింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కలిసి ఆ సంస్థను తెలంగాణలోకి తీసుకొచ్చారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఇందుకు సెబీ నుంచి తీసుకున్న సమాచారాన్ని జతచేసి మాట్లాడారు. మిగతా కంపెనీలకు ఇచ్చిన అనుమతుల్లో జరిగిన అవకతవకలపై నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
సాంకేతికంగా పెంచుకుంటాం
గత ఏడాది కంటే రూ.5 వేల కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరిపేందుకు బడ్జెట్లో పెట్టామని మంత్రి జూపల్లి చెప్పారు. ఇదంతా సాంకేతికంగా సాధ్యం అవుతుందని చెప్పారు. లిక్కర్ తయారీ, బేవరేజెస్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టి, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశామని, ఎయిర్‌పోర్టులు, చెక్‌పోస్టులు, రైల్వేల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రూ.5 వేల కోట్లకుపైగా ఆదాయం పెంచుకుంటామని చెప్పారు. ఆ ఆదాయం ఎలా పెంచుకుంటారో వివరణ ఇవ్వలేదు. మంత్రి స్పష్టమైన సమాధానం చెప్పాలంటూ ఒకదశలో బీఆర్ఎస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. కొంతసేపటి తర్వాత కట్ మోషన్ విత్ డ్రా తీసుకుంటామని హరీశ్‌రావు కోరగా, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు.