శనివారం 11 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 15:02:04

తూప్రాన్‌ ఆస్పత్రిని సందర్శించడం సురక్షితమే : వైద్యులు

తూప్రాన్‌ ఆస్పత్రిని సందర్శించడం సురక్షితమే : వైద్యులు

మెదక్‌ : మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌లో గల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను సందర్శించడం సురక్షితమేనని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో రోగులకు యధావిధిగా ఆరోగ్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు(డాక్టర్లు ఇద్దరు సోదరులు) కోవిడ్‌-19 బారిన పడ్డారు. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లో ఉంటున్న వీరి ఇంటికి బంధువుల్లోని ఓ వ్యక్తి వచ్చి కలిశాడు. అతడి లక్షణాలు చూసి కోవిడ్‌ టెస్ట్‌ చేసుకోవాల్సిందిగా సూచించారు. పరీక్షలో కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది.

అనుమానంతో ఇరువురు వైద్యులు, వారి తల్లిదండ్రులు కోవిడ్‌-19 పరీక్షలు చేసుకోగా అందరికీ కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. అప్పటినుంచి వారు విధుల నిమిత్తం ఆస్పత్రికి రాలేదని జిల్లా హెల్త్‌ సర్వీసెస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ వెల్లడించారు. కావునా పౌరులు ఎటువంటి సందేహాలు, సంకోచం లేకుండా ఆస్పత్రిని సందర్శించవచ్చన్నారు. సదరు వ్యక్తిని కలిసిన తర్వాత కోవిడ్‌-19 ప్రభావానికి గురైన వైద్యులు అప్పటినుంచి ఆస్పత్రికి రాలేదన్నారు.


logo