Congress Govt | ఆదిలాబాద్/కరీంనగర్(నమస్తే తెలంగాణ)/వికారాబాద్/ఖమ్మం రూరల్/జనగామ చౌరస్తా/ముదిగొండ, జనవరి 25 : గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు పథకాలను అట్టహాసంగా ప్రారంభిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అమలు విషయంలో యూటర్న్ తీసుకున్నది. మండలానికి ఒక్క గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు పథకాలను పైలట్‌గా అమలుచేయాలని నిర్ణయించింది. దీంతో ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను మళ్లీ పరిశీలించాల్సి వచ్చింది. రాత్రికి రాత్రి ఎంపిక చేయాల్సి రావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నానాహైరానా పడుతూ ఇంటింటికీ తిరిగి పరిశీలన చేపట్టాల్సి వచ్చింది.
శనివారం ఆయా గ్రామాల్లో చేపట్టిన సర్వేలు అర్ధరాత్రి వరకు కొనసాగినట్టు సమాచారం. కొన్ని గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లల్లో కూర్చొని సర్వేలు చేసినట్టు తెలిసింది. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులలో 79 మందిని ఇందిరమ్మ ఇండ్లకు, 62 మందిని రేషన్‌కార్డుల కోసం, 134 మందిని ఆత్మీయ భరోసాకు, 614 మందిని రైతుభరోసాకు అర్హులుగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన అధికారులు ఆదివారం వైరా ఎమ్మెల్యే చేతుల మీదుగా అర్హులకు మంజూరుపత్రాలు అందించనున్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారులు రాత్రిపూట సర్వేచేసి వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్, చిల్పూర్గార్లగడ్డతండా (ఫత్తేపూర్), దేవరుప్పుల మండలంలో లకావత్‌తండా(మాదాపురం), స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో తానేదార్పల్లి, జనగామ మండలంలో ఎర్రకుంటతండా(పెద్దపహాడ్), కొడకండ్లలో నీలిబండతండా(మొండ్రాయి), లింగాలఘనపురంలో కొత్తపల్లి, నర్మెటబొమ్మకూర్, పాలకుర్తి తీగారం, రఘునాథపల్లి కన్నాయపల్లి, తరిగొప్పులలో వాచ్యాతండా(అంకుషాపూర్), జఫర్గడ్లో అల్వార్బండతండా(శంకర్‌తండా)ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు కలెక్టర్ తెలిపారు. రాత్రిపూట అధికారులు గ్రామాల్లోకి రావడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే గ్రామాల్లో గ్రామసభలు పెట్టి లబ్ధిదారుల జాబితా ప్రకటించగా, మళ్లీ సర్వే ఏంటని ప్రశ్నించడం కనిపించింది.
పైలట్ గ్రామం ఎంపికలో వాగ్వాదం..
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామాన్ని తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయగా అధికారులు సర్వే చేపట్టారు. రెండు గంటలపాటు సర్వే తర్వాత మరో గ్రామం ఎంపిక చేయడంతో మా ఊళ్లో సర్వే చేసి ఇప్పుడు మరో ఊరు అంటారా? అని అధికారులతో గ్రామస్థులు వాగ్వానికి దిగారు. ఆగ్రహంతో గ్రామపంచాయతీ కార్యాలయం గేటుకు తాళం వేశారు. చేసేది లేక ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా తర్జనభర్జనల అనంతరం మార్పు ఏమీ లేదని, మీ గ్రామాన్నే ఎంపిక చేస్తున్నామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. ఇది డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గం కావడంతో చర్చనీయాంశమైంది.