Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి గారూ.. మీరు చేస్తున్నది తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్ అని సూచించారు. గత ఆరేళ్లలో ఫిబ్రవరి నెల జీఎస్టీ కలెక్షన్ల వృద్ధి రేటు (2021 కరోనా సంవత్సరం మినహా) ఎప్పుడూ 6% కంటే ఎక్కువే నమోదు అయింది.
కానీ రేవంత్ రెడ్డి పాలన కరోనా సమయాన్ని తలపిస్తూ ఒక శాతం మాత్రమే నమోదు చేసిందని తెలిపారు.మీరు, మీ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి ఇది మరో నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తికి ఇది అద్దం పడుతున్నదని హరీశ్‌రావు అన్నారు. హైడ్రా, మూసీ వంటి తలా తోక లేని నిర్ణయాలు, అనాలోచిత చర్యల వల్ల ఆగస్టు 2024 తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2024 ఏప్రిల్ – నవంబర్, 2023 ఏప్రిల్ – నవంబర్ మధ్య కాలంలో వాహన విక్రయాలు పోల్చితే -0.8 % నమోదు అయ్యినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు.
GST ఆదాయంలో తక్కువ వృద్ధి రేటు, రిజిస్ట్రేషన్లు, వెహికిల్ టాక్స్ లో నెగెటివ్ వృద్ధి రేటు రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాన్ని ఎండ గడుతున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పి.. పాలన పై శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు.