Congress | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): నలుగురు పీసీసీ వరింగ్ కమిటీ అధ్యక్షులు, 35 మందికిపైగా ఉపాధ్యక్షులు, 70 మందికిపైగా ప్రధాన కార్యదర్శులతో రూపొందించిన జంబో పీసీసీ కార్యవర్గం జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం తిరస్కరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత పెద్ద పీసీసీ కమిటీతో వ్యక్తులకు మినహా పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అ భ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చించి.. చివరకు 105మంది ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కూడిన జాబితాతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం ఢిల్లీ వెళ్లారు.
ఈ లిస్టును కాంగ్రెస్ హైకమాండ్‌కు అందజేసినట్టు తెలిసింది. ఈ జాబితా పట్ల మీనాక్షి నటరాజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. టీపీసీసీ కమిటీ జాబితాను ఆయనకు అందజేసి, మీనాక్షి నటరాజన్ వ్యక్తంచేసిన అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
కేసీ వేణుగోపాల్ కూడా మీనాక్షి అభ్యంతరాలతో ఏకీభవిస్తూ.. జాబితాను కుదించి తీసుకురావాలని సూచించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇద్దరు నేతలు కూడా ఆదివారం రాత్రి ఢిల్లీలోనే ఉండి, మరోసారి జాబితాపై పునఃసమీక్ష చేసుకొని, పరిమిత సభ్యులతో కార్యవర్గాన్ని రూపొందించి సోమవారం మరోమారు కేసీ వేణుగోపాల్‌ను కలిసే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.