Caste Census | హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): కులగణనతో బీసీల మన్నన పొందాలన్న ప్రయత్నం బెడిసికొట్టిందని, బీసీల జనాభా నివేదికపై వెనుకబడిన వర్గాలు ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేరని ఓ సీనియర్ మంత్రి కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. కులగణన సర్వేతో ప్రజలను సంతృప్తిపరచలేకపోగా మరిన్ని అనుమానాలను పెంచినట్టయిందని ఆయన అధిష్ఠానానికి వివరించినట్టు సమాచారం. బీసీల్లోకి సానుకూలంగా వెళ్లాల్సిన అంశం ప్రతికూలంగా మారిందని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఢిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో విడిగా భేటీ అయిన సందర్భంలో.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణన అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది.
రాష్ట్రంలో జరిగిన కులగణనను రాహుల్‌గాంధీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, ఇక్కడ వచ్చే ఫలితాలను దేశానికి రోల్‌మోడల్‌గా చూపించాలని అనుకున్నారని ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ అన్నట్టు తెలిసింది. దీనిపై సదరు మంత్రి ప్రతి సమాధానం ఇస్తూ… తాము చేపట్టిన సర్వే బీసీ ప్రజలను సంతృప్తి పరచలేకపోయిందని, వారి జనాభను తక్కువచేసి చూపించే కుట్ర జరిగినట్టుగా భావిస్తున్నారని వివరించారని తెలిసింది. 48 నియోజకవర్గాల మీద తమ ప్రాబల్యం ఉన్నట్టు బీసీ నేతలు నమ్ముతున్నారని, ఈ నియోజక వర్గాల సంఖ్యను తగ్గించి చూపేందుకే బీసీ జనాభాను తగ్గించారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నట్టు రాష్ర్టానికి చెందిన సదరు అగ్రనేత అధిష్ఠానానికి వివరించినట్టు సమాచారం.