Vijayashanti | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. ఏప్రిల్ మూడున కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని గాంధీభవన్ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. మంత్రివర్గ విస్తరణతోపాటు పునర్వ్యవస్థీకరణ కూడా జరుగవచ్చని పేర్కొన్నాయి. తుది ఎంపికపై కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గం కోటాలో ఆరు ఖాళీలు ఉండగా.. 30 మంది ఆశావహుల పేర్లను అధిష్ఠానానికి పంపినట్టు తెలిసింది. అయితే మొత్తం ఆరు ఖాళీలను భర్తీచేస్తారా లేక నాలుగింటితో సరిపెడతారా అన్నదానిపై స్పష్టత రాలేదు. మంత్రిపదవులను ఆశించి భంగపడిన వారిని ఊరించేందుకు రెండు స్థానాలను ఖాళీగా ఉంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ రెండు బెర్తులను ఎరగా చూపించి అసంతృప్తి జ్వాలలను చల్లార్చవచ్చన్నది ఎత్తుగడగా భావిస్తున్నారు.
ఫ్యామిలీ ప్యాక్ బొనాంజా..
ఏఐసీసీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ప్రస్తుత మంత్రివర్గం నుంచి ఇద్దరిని తొలగించి, మొత్తంగా ఆరుగురిని కొత్తగా చేర్చుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు లీకులు వదులుతున్నాయి. ఉద్వాసనకు గురయ్యేవారిలో వరంగల్ జిల్లాకు చెందిన మహిళామంత్రితోపాటు, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో మంత్రి కూడా ఉన్నట్టు ఆ లీకుల సారాంశం. ఇక కొత్తగా చేరేవారిలో నల్లగొండ జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్లు వినిపిస్తున్నాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన భార్య పద్మావతికి మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఆమెను డిప్యూ టీ స్పీకర్గానైనా నియమించాలని, తనకు రెవెన్యూ లేదా ఆర్థిక శాఖ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఇందుకు అధిష్ఠానం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
ముఖ్యనేతను కాదని శ్రీహరికి…
బీసీ సామాజిక వర్గం నుంచి మహాబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరును ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ అమీర్‌అలీఖాన్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.
లిక్కర్ రింగ్ లీడర్‌కు ముఖ్యనేత దన్ను
ఇటీవల బీర్ల ధరలో పెంపులో చక్రం తిప్పిన ఉత్తర తెలంగాణకు చెందిన మరో నేత పేరును మంత్రిపదవి కోసం ముఖ్యనేత ముందుకు తెచ్చినట్టు కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఆయనకు కోసం ముఖ్యనేత కొన్ని త్యాగాలు, ఇంకొన్ని రాజకీయ ఎత్తుగడలతో వ్యూహ రచన చేసినట్టు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది.
ఏడుగురి శాఖల మార్పు
మంత్రివర్గ విస్తరణలో ఏడుగురు మంత్రుల శాఖలు మారుతాయని గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, మెదక్ జిల్లాకు చెందిన మరో మంత్రి ఈ జాబితాలో ఉన్న విషయం తెలిసిందే. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తే ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డి శాఖలను మార్చే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల శాఖను కూడా మార్చే ఆలోచన ఉన్నట్టు సమాచారం. మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు మరిన్ని శాఖలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. మంత్రి సీతక్కకు పంచాయతీరాజ్ శాఖను తొలిగించి మరో శాఖను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతున్నది.
ఆమె ఔట్.. రాములమ్మ ఇన్
వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన వరంగల్ జిల్లాకు చెందిన మహిళా మంత్రిని క్యాబినెట్ నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఓ సినీ నటుడి కటుంబంతో ఏర్పడిన వివాదంపై అధిష్ఠానం ఆమె పట్ల అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేతో సదరు మంత్రికున్న విభేదాలు రచ్చకెక్కాయి. ఆమె స్థానంలో తనకు అవకాశం ఇవ్వాలని దొంతి మాధవరెడ్డి కోరుతున్నారు. కానీ సామాజికవర్గాల సర్దుబాటులో ఆయనను చేర్చుకోవటం సాధ్యం కాదని స్పష్టం చేసినట్టు సమాచారం. మధ్యేమార్గంగా అదే జిల్లాకు చెందిన మున్నూరు కాపు నేత, ఎమ్మెల్సీ విజయశాంతి పేరును అధిష్ఠానం తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. నిజానికి టీపీసీసీ రూపొందించిన 30 మంది ఆశావహుల జాబితాలో ఆమె పేరు లేదు. విజయశాంతి స్వస్థలం ములుగు జిల్లాలోని రామన్నగూడెంగా చెప్తున్నారు.