రాజన్న సిరిసిల్ల, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ‘పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవటం ఖాయం. మరో ఏక్‌నాథ్‌షిండే.. మరో హిమంతబిశ్వశర్మ ఇక్కడే పుడతడు. కాంగ్రెస్‌ను బొందపెడ్తడు. ఆషామాషీగా చెప్తలేను. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతోనే చెప్తున్నా. మోదీ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలే చెప్తున్నాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.
మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ‘ఎన్నికలు రెండు నెలలు లేవు. భవిష్యత్తులో మీ ఆశీర్వాదం ఉండాలని ఈ టైంల మోదీని రేవంత్ అడిగిండు. అంటే అర్థమేంది? మా రాహుల్‌గాంధీ తట్టపార వేస్టు కేసు.. గెలిచేది లేదు.. పీకేది లేదు.. మళ్లీ మీరే ప్రధాని అని చెప్పినట్టు కాదా? కాంగ్రెస్ సీఎం ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు భవిష్యత్తులో ప్రధానిగా నరేంద్రమోదీ ఉండాలని ఎలక్షన్ల ముందు అంటడా? దీని ఉద్దేశం రాహుల్‌గాంధీ వేస్ట్‌ఫెలో, సన్నాసి.. ఆయనతో కాదు.. నువ్వే ప్రధాని అని కాంగ్రెస్ సీఎం చెప్తే ఏమనుకోవాలి? ఇది దివాలాకోరు రాజకీయం కాదా? రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. ఏం జరుగుతున్నదో ఓసారి ఆలోచించండి’ అని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేండ్లలో తెలంగాణ గిరిజనులు, రైతులు, విద్యార్థులకు ఏం చేసింది? అని అన్నారు. రామమందిరం పేరు చెప్పి, రాముడిని అడ్డం పెట్టుకొని మళ్లీ ఓట్లు దండుకునే చిల్లర ఆలోచన చేస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డలో ఒకటి, రెండు పిల్లర్లలో సమస్య వస్తే.. రిపేర్లు చేయకుండా బరాజ్‌ను డ్యామేజీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం దివాలాకోరు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై కోపాన్ని రైతుల మీద తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో మల్లన్నసాగర్ ద్వారా కూడెల్లివాగు, నర్మాల ప్రాజెక్టు నింపి అన్ని గ్రామాలకు కాళేశ్వరం జలాలు అందించామని గుర్తు చేశారు. ఈసారి నీళ్ల సంగతేంటని కాళేశ్వరం సీఈని అడిగితే.. ఏప్రిల్, మేలో కేసీఆర్ విలువేందో తెలుస్తదని, మీరు యాదిపెట్టుకోవాలని సమాధానం ఇచ్చినట్టు చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు పత్రాలు ఇస్తూ తానే ఉద్యోగాలిచినట్టు చెప్పుకుంటున్న సిగ్గులేని, దగుల్బాజీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ వచ్చినంక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చినట్టు సీఎం ప్రచారం చేసుకుంటున్నరు. పోలీసు, నర్సు ఉద్యోగాలు ఇచ్చినట్టు సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నరు. ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు?’ అని ప్రశ్నించారు. బతుకమ్మ చీరలు క్యాన్సిల్ చేసి నేతన్నల పొట్ట కొట్టొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు విజ్ఞప్తి చేశానని తెలిపారు. నేతన్నలను అవమానపరిచిన కేకే మహేందర్‌రెడ్డి క్షమాపణ చెప్పాకే సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు రావాలని డిమాండ్ చేశారు. తనపై కోపంతో సిరిసిల్ల నేతన్నల కొంపముంచే ప్రయత్నం చేస్తున్నారని, కేసీఆర్ మీద కోపంతోని కాళేశ్వరం ప్రాజెక్టు దండగంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
కాంగ్రెసోళ్లు కొత్త బిచ్చగాడొచ్చినట్లు ఎగిరెగిరి పడుతున్నారని, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టంగనే పోలీసులతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ పరిస్థితి ఒక సిరిసిల్లలోనే కాదని, అంతటా ఇలాగే ఉన్నదని చెప్పారు. ప్రజలను మోసం చేసి 420 లంగ హామీలు, దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. రూ.2 లక్షల లోను తెచ్చుకోండి.. డిసెంబర్ 9న రుణమాఫీపై సంతకం పెడుతానని మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. రైతులు మోసపోయామని బాధపడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే ఢిల్లీలో ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటరు తప్ప ఎవరు పార్లమెంటులో మాట్లాడరని కేటీఆర్ విమర్శించారు. వీళ్లకు సొంతంగా వెన్నెముక ఉండదని, దమ్ముండదని అన్నారు. ఎప్పటికైనా మాట్లాడేది, కొట్లాడేది గులాబీ జెండా మాత్రమేనని, కొట్లాడాలంటే అది కేసీఆర్ దళానికే సాధ్యమని స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట గుడి కట్టిన కేసీఆర్ రాజకీయం చేశారా? అని ప్రశ్నించారు. ‘ఇంటింటికీ యాదాద్రి ఫొటోలు, అక్షతలు పంపపోదుమా? దేవుడి పేరిట రాజకీయం చేయకుండా చేసిన అభివృద్ధి పనులనే చెప్పుకుంటూ ముందుకు వెళ్లాం’ అని చెప్పారు.
‘మొన్న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తే సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించటం.. సభలో పాల్గొనటం.. అంతవరకు బాగానే ఉన్నది. బీఆర్ఎస్ సర్కారు కూడా 2014 నుంచి 2021 వరకు మోదీకి ఎంత గౌరవం ఇయ్యాలో అంతకన్నా ఎక్కువే ఇచ్చింది. మేం కూడా లైన్ కట్టి నిలబడి, మస్తు రిసీవ్ చేసుకున్నం. మస్తు కలిసినం. ఆయన పిలిస్తే సీఎం, మంత్రులం తండోపతండాలుగా పోయినం. ఏడేండ్లు తండ్లాడినం. అయినా ఏమైంది? మెండి చెయ్యి తప్ప. 2021 నుంచి పోవుడు కూడా బంజేసినం. ఈ పెద్దమనిషి వస్తడు.. చేతులు ఊపుకుంట పోతడు. ఏపీలో కొత్త రాజధాని కట్టుకుంటే తట్టెడు మట్టి.. లొట్టెడు నీళ్లు తప్ప ఏం ఇయ్యలేదు. మనకు కూడా ఏడేండ్లలో ఏమీ ఇయ్యలే. కలుసుడు దండుగ అని పోవుడు బంజేసినం. సరే కొత్త మురిపెం కాబట్టి రేవంత్‌రెడ్డి పోయిండు. రిసీవ్ చేసుకున్నడు. సభలో పాల్గొన్నడు. అంతవరకు బాగానే ఉన్నది. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే.. దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ మాడల్‌ను కాదని, గుజరాత్ మాడల్‌ను కాపీ కొట్టి రాష్ర్టాన్ని మంచిగా చేసుకుంట అని చెప్తడా? ఇదే ముఖ్యమంత్రి మూడు నెలల క్రితం ఏముంది గుజరాత్ మోడల్? అని ప్రశ్నించారు. గుజరాత్ మాడల్ అంటే మతం పేరు మీద చంపుడా? మనుషులను బొందపెట్టుడా?’ అని అడిగారు.
ఉద్యమంలో మనతో కలిసి పనిచేసిన విద్యావంతుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ఉచితంగా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిర్వహించే పార్టీ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ నెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో చేపట్టే బహిరంగసభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ప్రవీణ్, మండల శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మోదీని పెద్దన్నగా పిలువడంలో తప్పేం లేదు. ప్రధాని స్థానంలో ఉన్నవారు పెద్దన్న తరహా పాత్ర పోషిస్తారు. అమెరికాను ఇతర దేశాలు బిగ్ బ్రదర్ అని పిలుస్తాయి. గుజరాత్‌కు మోదీ అనేక ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఇదే తరహాలో తెలంగాణకు కూడా మంజూరు చేయాలని కోరాను. బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించడం వల్లనే.. మోదీ..జాతీయ కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని అన్నారు.
-సీఎం రేవంత్‌రెడ్డి
ప్రధాని మోదీని పెద్దన్న అని ఎందుకు సంబోధించారో సీఎం రేవంత్‌రెడ్డినే అడగండి. పెద్దన్న అన్నంత మాత్రాన రెండు పార్టీలు ఒక్కటి కావు. ఎందుకు అలా అన్నారో రేవంత్‌రెడ్డినే అడిగితే బాగుంటుంది. కాంగ్రెస్ అట్టహాసంగా 6 గ్యారెంటీలు ప్రకటించింది.. అమలులో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. గ్యారెంటీలన్నీ ఎప్పటినుంచి అమలు చేస్తారో కచ్చితంగా చెప్పడం లేదు. కాంగ్రెస్ వైఖరిని ఎండగడతాం.
-కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు