Cotton Procurement | హైదరాబాద్, మే 3(నమస్తే తెలంగాణ) : పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తున్నది. అడ్డగోలు టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్లు)లు జారీ చేసి అవకతవకలకు పాల్పడినట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఈ సీజన్లో ఏకంగా 54 వేల టీఆర్లు జారీ చేసినట్టుగా గుర్తించారు. వీటిలో కేవలం 10 వేల మంది మాత్రమే అసలు రైతులు ఉండగా మిగిలిన వారంతా జిన్నింగ్ మిల్లులు, ట్రేడర్స్కు సంబంధించిన వాళ్లేనని తేలినట్టు తెలిసింది. వీళ్లంతా రైతుల నుంచి తక్కువ ధరకు అంటే క్వింటాలుకు రూ. 5500 నుంచి రూ.6 వేల వరకు పత్తి కొనుగోలు చేసి ఆ తర్వాత నకిలీ టీఆర్లతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కు మద్దతు ధర రూ.7521కు అమ్మినట్టుగా విచారణలో గుర్తించారు.
ఇందులో భాగంగానే జిన్నింగ్ మిల్లులు, ప్రైవేట్ ట్రేడర్లతో సీసీఐలోని పలువురు అధికారులు కుమ్మక్కైనట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీఐ అధికారులకు తెలియకుండా ఇంత భారీ సంఖ్యలో టీఆర్లను ఎలా జారీ చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఇక టీఆర్ల జారీలో వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏఈవోలు, ఏఈవోలతో పాటు మార్కెటింగ్ శాఖకు చెందిన మార్కెటింగ్ కార్యదర్శులు కీలక పాత్ర పోషించినట్టుగా తెలిసింది. జిన్నింగ్ మిల్లులు, ట్రేడర్లతో చేతులు కలిపి అడ్డదారిలో అడ్డగోలుగా టీఆర్లు ఇచ్చినట్టు సమాచారం. కొందరు ఏఈవోలు, ఏవోలు నకిలీ టీఆర్లు ముద్రించి మరీ ఇచ్చినట్టు తెలిసింది. వీటిపై మార్కెటింగ్ కార్యదర్శులు గుడ్డిగా సంతకాలు చేశారని, దీంతో పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు రాచమార్గం పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అడ్డగోలు టీఆర్ల జారీతోనే కాకుండా పత్తి పొడవులోనూ అవకతవకలకు పాల్పడినట్టు తెలిసింది. పత్తి పొడవును బట్టి ధర ఉంటుంది. మధ్యస్త రకానికి రూ.7,121 మద్దతు ధర ఉండగా లాంగ్ స్టాపుల్ (పొడవు గింజ) రకానికి రూ.7,521గా ధర ఉన్నది. అంటే రెండింటి మధ్య రూ.200 వ్యత్యాసం ఉన్నది. దీంతో సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లులు, ట్రేడర్లు దీన్ని ఆసరాగా చేసుకొని అవకతవకలకు పాల్పడినట్టు తెలిసింది. మధ్యస్త రకాన్ని కూడా లాంగ్ స్టాపుల్ రకంగా గుర్తించి అధిక ధర చెల్లించినట్టు సమాచారం. ఇలా భారీగా సొమ్మును వెనకేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.