వరంగల్, సెప్టెంబర్ 15 : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించడం మంచి పరిణామం అని తెలంగాణ సాయుధ పోరాట యోధులు కత్తెరశాల కుమరయ్య (95), అడవయ్య బేరే (91) అన్నారు.
ఈ నెల 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వారు మంత్రి ఎర్రబెల్లిని కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నాడు తెలంగాణ కోసం పోరాటం చేసి జైళ్లకు వెళ్లామన్నారు. ఆనాడు ఆనాటి వ్యవస్థలో అణచివేత విపరీతంగా ఉండేదన్నారు.
వాటిని భరించలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూడలేకే తాము పోరాటం చేశామన్నారు.నాటి పోరాట ఘట్టాలను మంత్రికి వివరించారు.
కాగా, మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..వారి ఆనాటి పోరాట స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేశారని, గాంధీజీ చూపిన శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. మీ త్యాగాల ఫలితమే నేటి దేశం, తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. వారిని అభినందించి మంత్రి వారికి సన్మానం చేశారు.