హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో వాల్మీకి స్కామ్ జరిగి 5 నెలలైనా నోరుమెదపని బీజేపీ, ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన 5 నిమిషాలకే అక్కసు వెళ్లగక్కుతున్నదని బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిలివ్వడంపై హర్షం ప్రకటించింది. బెయిల్ మంజూరు సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యక్తపరిచిన అభిప్రాయాలే ఎమ్మెల్సీ కవిత తుది తీర్పు సమయంలో ఉంటాయన్న ఆశాభావం వ్యక్తంచేసింది. ఎమ్మెల్సీ కవిత కడిగిన ము త్యంలా కేసు నుంచి బయటికొస్తారని తేల్చిచెప్పింది. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయి ల్ మంజూరు అనంతరం మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్యెల్యే బాల్క సుమన్ ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, గజ్జెల నగేశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు పాల్గొన్నారు. వాల్మీకి స్కామ్‌పై తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతల నోర్లెందుకు మూతపడ్డాయని ధ్వజమెత్తారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బు తెలంగాణ కాంగ్రెస్ నేతల ఖాతాల్లో జమయ్యాయని, దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందు కు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. కవితకు బెయిల్ వచ్చిన 5 నిమిషాల్లోనే అక్కసు వెళ్లగక్కిన బండి సంజయ్ భేషరతుగా న్యాయస్థానానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, పీసీసీ నేత మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థకు ఉద్దేశాలు ఆపాదించాయని, వారి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తే కాంగ్రెస్, బీజేపీలు పైశాచిక ఆనందం పొందుతున్నాయని మాజీ మంత్రులు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్, చిదంబరంకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందంటే బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయాయని అనుకోవాలా? అని ప్రశ్నించారు. కరీంనగర్లో అమృత్ స్కీమ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ సృజన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సమీపబంధువు కాదా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత పాత్ర లేదని తాను భావిస్తున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు మంగళవారం నాడిక్కడ తెలిపారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. బెయిలు పొందేందుకు కవిత అర్హురాలని తెలిపారు. రాజకీయంగా ఎన్ని కుట్రలు జరిగినా ఆమె పోరాడిందని, ఆ పోరాటానికి సుప్రీంకోర్టు ద్వారా ఫలితం దక్కిందని పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఏ మాత్రం సంబంధం లేకున్నా ఎమ్మెల్సీ కవితపై ఈడీ అక్రమ కేసు బనాయించి అన్యాయంగా జైల్లో వేయించడం బాధాకరమని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆవేదన వ్యక్తంచేశారు. లిక్కర్ పాలసీలో ఆమెకు ప్రమేయం లేదని, ఇందుకు సంబంధించి ఆమె వద్ద నుంచి ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభించలేదని చెప్పారు.