హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ ఉద్యోగాలు.. స్వరాష్ట్రంలో జిల్లాల తలుపు తడుతున్నాయి. దీంతో పట్టణ యువతకే ఐటీ అవకాశాలు అనే అపోహలు తొలగిపోయాయి. మారుమూల ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న యువత సైతం ఐటీ ఉద్యోగం సాధించి కాలర్ ఎగరేస్తున్నది. త్రీ‘ఐ’తో ఐటీ రంగ ముఖచిత్రాన్ని మార్చిన తెలంగాణ సర్కారు.. త్రీడీ మంత్రతో ఆ వెలుగులను రాష్ట్ర నలుమూలలకు తీసుకెళ్తున్నది. టైర్-2 (ద్వితీయ శ్రేణి) నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరింపజేసేందుకు ఆరేడు సంవత్సరాల కిందటే చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు ప్రధాన జిల్లా కేంద్రాల్లో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మరికొన్ని నెలల్లో మరో ఐదు జిల్లాల కేంద్రాల్లో ఐటీ టవర్లు అందుబాటులోకి రానున్నాయి.
కరోనా విపత్తు తర్వాత వివిధ దేశాలు ఐటీ, ఐటీఈఎస్ రంగాన్ని టైర్-2 నగరాల్లోనూ విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం హైదరాబాద్ మహా నగరంలో ఐటీ రంగ విస్తరణ, వృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల యువతకు ఐటీ రంగంలో విస్తృతంగా భాగస్వామ్యం కల్పిస్తున్నది. అందులో భాగంగా త్రీడీ మంత్ర (డిజిటైజ్, డీకార్బనైజ్, డీసెంట్రలైజ్)కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్‌లను నిర్మించాలని నిర్ణయించారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ విస్తరణపై తాజా పరిస్థితిని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు శనివారం ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇప్పటికే ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఐటీహబ్లలో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సిద్దిపేట, ఆదిలాబాద్‌లో ఐటీహబ్‌లు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం హైదరాబాద్‌లో కల్పించినట్టుగానే టైర్-2 నగరాల్లోనూ మెరుగైన మౌలిక వసతులు, అనువైన వాతావరణాన్ని కల్పిస్తుందని తెలిపారు.
ఐటీ కంపెనీలు టైర్-2 నగరాల్లోనూ కార్యకలాపాలను విస్తరించాలని కోరారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన యువత టైర్-2 పట్టణాల్లోని విద్యాసంస్థల్లో చదువుతున్నారని, ఇందుకు వరంగల్‌లోని ఎన్ఐటీ, బాసర ట్రిపుల్ ఐటీని ఉదహరించారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఐటీహబ్‌గా మారిన వరంగల్ నిర్మాణాత్మక చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్‌లను గ్రామీణ విద్యార్థులు సందర్శిస్తే వారిలో వినూత్నమైన ఆవిష్కరణలు మొగ్గ తొడిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
6 నెలల్లో ఐదు ఐటీ హబ్‌లు సిద్ధం
రాష్ట్రంలో ఐదు ఐటీ టవర్ల పురోగతిని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. నిజామాబాద్‌లో చేపట్టిన ఐటీ హబ్ దాదాపు ప్రారంభానికి సిద్ధమైందని తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే గణేశ్ బిగాలను అభినందించారు. ప్రవాస భారతీయులకు చెందిన సంస్థలను ఇక్కడికి ఆహ్వానించి ఐటీహబ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గణేశ్ బిగాల కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లోని ఐటీ హబ్ నెలరోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలిపారు. ఇక్కడ పనులు వేగవంతంగా పూర్తయ్యేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో సిద్దిపేట ఐటీ హబ్ ఎంతో చక్కగా రూపుదిద్దుకుంటున్నదని పేర్కొన్నారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ తరువాత సిద్దిపేట ఐటీహబ్‌ను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నల్లగొండ ఐటీహబ్‌లో ప్రస్తుతం నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరో నాలుగు నుంచి ఆరు నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. నల్లగొండలో పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే వరుసలో ఆదిలాబాద్ ఐటీ హబ్ ఉన్నదని పేర్కొన్నారు.