హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : దళిత బంధు పథకం అమలు చేయాలంటూ హుజూర్నగర్, ములుగు, పరకాల, హుజూరాబాద్, సూర్యాపేట నుంచి సుమారు 200 మంది లబ్ధిదారులు ప్రజాభవన్‌కు తరలివచ్చి మంత్రి సీతక్కకు వినతిపత్రం ఇవ్వాలని చూడగా ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోయారు. బాధితులు మంత్రి కాన్వాయ్ వెంట పరుగెత్తినా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ దళితబంధు అందించాలని కోరుతూ దళితబంధు సాధనసమితి ఆధ్వర్యంలో 200 మంది శుక్రవారం ప్రజాభవన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో మంత్రి సీతక్క ‘మూసీ’ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉన్నారు. మంత్రిని కలిసి వినతిపత్రం అందిస్తామని సమితి నాయకులు సిబ్బందికి వివరించారు. చెక్కుల పంపిణీ ముగిశాక మంత్రి సీతక్క బయటకు రాగా బాధితులందరినీ పోలీసులు చుట్టుముట్టారు. ఎవరైనా ఇద్దరికి మంత్రిని కలిసే అవకాశం ఇస్తామని.. వినతిపత్రం అందించాలని అధికారులు సూచించారు.
అంగీకరించిన డీబీఎస్ఎస్ నాయకులు మంత్రిని కలిసేందుకు సిద్ధమయ్యారు. ఈ లోపు మంత్రి కాన్వాయ్‌లో ఎక్కేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎదురుగా పరుగెత్తినా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసాలకు ఓర్చి వస్తే కనీసం తమ బాధ వినరా? అని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం సెర్ప్ సీఈవో దివ్యరాజన్కు డీబీఎస్ఎస్ అధ్యక్షుడు కే మహేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. 200 మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వస్తే మంత్రిని కలిసే అవకాశం దక్కలేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు అర్హులందరికీ అందేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.