మహబూబ్‌నగర్, జూన్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరుపై సీఎం రేవంత్‌రెడ్డిది కపట ప్రేమేనని తేలింది. ఉమ్మడి జిల్లా నీటివాటాపై కొట్లాడలేని నైజం బయటపడింది. పాలమూరుకే చెందిన సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రయోజనాలు కాపాడుతారని భావిస్తే.. తన గురువు చంద్రబాబును, కేంద్ర జల్‌శక్తి మంత్రిని పొగడ్తలతో ముంచేస్తూ, చివరకు ఈ జిల్లాకు తీవ్ర నిరాశను మిగిల్చారు. మన నీటివాటాను యథేచ్ఛగా కొల్లగొడుతున్న వారితో చెట్టాపట్టాలేసుకొని మన హక్కుల గురించి నీతి వాక్యాలు వల్లెవేస్తుండటంపై ఈ ప్రాంత రైతాంగం ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నది. కర్ణాటకలోని తుంగభద్రా డ్యామ్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి.. కృష్ణా, తుంగభద్రా నదీజలాలపై పాలమూరు హక్కులను సాధిస్తారనుకున్నారని అంతా భావించారు.
కానీ పాలమూరుపై ఎప్పటిలాగే తన కపట ప్రేమను బయట పెట్టుకొన్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని తుంగభద్రా నదిని పథకం ప్రకారం చెరబడుతుంటే.. మరోవైపు తెలంగాణ సీఎం కేవలం ఆర్డీఎస్ నీటి వాటాపై మాట్లాడుతూనే.. రాయలసీమ జిల్లాల రైతాంగం పరిస్థితిని కూడా ప్రస్తావించడం గమనార్హం. పాలమూరు జిల్లాలో వలసలు పోతున్నారని అంటూనే.. ముగ్గురు సీఎంలం మాట్లాడుకొన్నామని, కేంద్ర మంత్రిగా పరిష్కారం చూపండి.. అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతాంగానికి ఆగ్రహం తెప్పించింది. తుంగభద్రా నుంచి చుక్క నీరు రాకుండా కర్ణాటక ఇప్పటికే ఆర్డీఎస్ ఎగువన, దిగువన బ్రిడ్జి కమ్ బ్యారేజీలను నిర్మిస్తున్నది. దీనివల్ల ఇటు ఏపీకి కూడా ప్రయోజనం కలుగుతున్నది. ఇదే గనుక జరిగితే ఆర్డీఎస్కు మరణశాసనం ఖాయం.
ఈ పరిణామాలపై స్పందించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్.. ఆర్డీఎస్‌పై కర్ణాటక నిర్మిస్తున్న బ్యారేజీలను పరిశీలించి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని అల్టిమేటం ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వాలకు పాలమూరు జిల్లా రైతాంగం తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. దీంతో కృష్ణా, భీమా, తుంగభద్రా నదీజలాల వ్యవహారంపై పొలిటికల్ హీట్ పెరిగింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర మొదలుపెడ్తామని బీఆర్ఎస్ హెచ్చరికతో దిగివచ్చిన సీఎం రేవంత్.. ఇటీవలే రెండ్రోజులపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఆరు నెలల్లో నిధులు కేటాయించి నార్లాపూర్, ఏదుల మధ్య నిలిచిన కాలువల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. 2027 లక్ష్యంగా పెట్టుకొని ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తిచేస్తామని పాలమూరు జిల్లా ప్రజల సాక్షిగా హామీ ఇచ్చారు. దీంతో గులాబీ పార్టీ నాయకులు పాదయాత్రను తాత్కాలికంగా విరమించారు. అయినా పాలమూరు ఎత్తిపోతలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది.
ఆర్డీఎస్ ఎగువన, దిగువన బ్రిడ్జికమ్ బ్యారేజీల నిర్మాణాలు చేపట్టడంపై పాలమూరు రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ఆ అక్రమ ప్రాజెక్టులపై తుంగభద్రా డ్యామ్ వేదికగా సీఎం రేవంత్ మాట్లాడకపోవడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. మరోవైపు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు నదీజలాల విషయంలో ‘మాట్లాడుకున్నవి పరిష్కరించండి’ అంటూ వేడుకోవడం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా సీఎం రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు, ఈ ప్రాంత రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారనున్నది.