హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై క్రిమినల్ కేసులను విచారిస్తున్న కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) అందజేస్తేనే ఆయనకు పాస్‌పోర్టు జారీ చేయాలని హైకోర్టు పాస్‌పోర్ట్ అథారిటీకి ఉత్తర్వులు జారీ చేసింది. పలు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో తనకు పాస్‌పోర్టు జారీచేసేందుకు పాస్‌పోర్ట్ అథారిటీ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ లక్ష్మణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ జరిపారు.
క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన పాస్‌పోర్టు జారీకి అడ్డంకి కాబోదని గతంలో ఇదే హైకోర్టు తీర్పులు వెలువరించిందని న్యాయమూర్తి పేర్కొంటూ.. నిబంధనల ప్రకారం కింది కోర్టు నుంచి ఎన్వోసీ పొందాలని, అందుకోసం కింది కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చని పిటిషనర్‌కు స్పష్టం చేశారు.
పిటిషనర్ నుంచి దరఖాస్తు అందిన తర్వాత కింది కోర్టు సత్వర నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. కింది కోర్టు నుంచి పొందిన ఎన్వోసీని పిటిషనర్ సమర్పించాక పాస్‌పోర్టు జారీకి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పాస్‌పోర్ట్ అథారిటీకి ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఈ ఉత్తర్వులతో తాము లక్ష్మణ్ కుమార్‌ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్టు కాదని స్పష్టం చేశారు.
విదేశాలకు వెళ్లాలని ఆయన భావిస్తే క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న కోర్టు నుంచి అనుమతి ఉత్తర్వులు పొందాలని తేల్చిచెప్పారు. విదేశీ ప్రయాణాలకు అనుమతి ఇచ్చే ముందు కింది కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని లక్ష్మణ్ కుమార్‌ను హెచ్చరిస్తూ.. ఆయన పిటిషన్‌పై విచారణను మూసివేశారు.