(స్పెషల్ టాస్క్బ్యూరో – నమస్తే తెలంగాణ) ; ఫోన్‌ట్యాపింగ్.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వవర్గాలను కుదిపేస్తున్న అంశమిది. అధికారదర్పం దేవుడెరుగు.. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్‌లోని కీలక నేతలంతా నీడను సైతం నమ్మలేని భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏ ఇద్దరు కలిసినా దీనిపైనే చర్చ జరుగుతుండటంతో అసలు ఫోన్‌ట్యాపింగ్‌పై కూపీ లాగేందుకు ప్రయత్నించిన కొందరు కీలక మంత్రులు షాక్‌కు గురయ్యే వాస్తవాలు వెల్లడైనట్టు తెలిసింది. ‘ముఖ్య’ నేత ప్రధాన అనుచరగణం చేతిలో ఈ వ్యవస్థ పనిచేస్తున్నదని విన్నవారికి దిమ్మతిరిగినట్టు సమాచారం. ఇందుకోసం అత్యాధునిక పరికరాలు దిగుమతి చేసుకున్న సదరు ‘గణం’ నగరంలోని రెండు ప్రాంతాల్లో వాటిని ఏర్పాటుచేసి ఫోన్‌ట్యాపింగ్ కొనసాగిస్తున్నట్టు తెలిసింది. గతంలో ‘ముఖ్య’నేతకు సంబంధించిన సోషల్ మీడియాను నిర్వహించిన వ్యక్తి ఇప్పుడు ఫోన్‌ట్యాపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ‘ధనుష్ టు పెదరాయుడు.. పెదరాయుడు టు ధనుష్’ అన్నట్టు ఆ వ్యక్తి కేవలం బాస్ సూచనలను పాటిస్తూ.. ఆయనకే నేరుగా రిపోర్టు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో కించిత్తు లీకేజీ లేకుండా వ్యవహారం అత్యంత గుట్టుగా, సురక్షితంగా సాగుతున్నది.
పోలీసుశాఖతో సంబంధం లేకుండా
ప్రజాపాలనలో ప్రజలకు స్వేచ్ఛ మాట ఎలా ఉన్నా! తాము ఏలికలం అని చెప్పుకుంటున్న వారికే ప్రస్తుతం స్వేచ్ఛ కరువైంది. ముఖ్యంగా ఫోన్లో మనసులోని మాట చెప్పుకునే పరిస్థితులు లేకపోవడం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కొంతకాలంగా మంత్రులు… ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా జరుగుతున్న ఫోన్‌ట్యాపింగ్ చాలామందికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది. తాజాగా బయటికొస్తున్న మరికొన్ని సంచలన విషయాలు సదరు నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. చివరకు కాంగ్రెస్ దూత ఫోన్‌ను సైతం రాడార్లోకి తెచ్చారంటే.. ట్యాపింగ్ ప్రక్రియ ఏ స్థాయిలో సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చని అధికార పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
అస లు పోలీసు శాఖతోనే సంబంధం లేకుం డా ట్యాపింగ్ కోసం సమాంతరంగా ఒక ప్రైవేటు వ్యవస్థనే ఏర్పాటుచేశారనే విష యం బయటపడినట్టు తెలిసింది. కొన్ని నెలల కిందటనే నగరంలోని రెండు చోట్ల ఈ వ్యవస్థల్ని ఏర్పాటుచేసి ట్యాపింగ్ ప్రక్రియ విస్తృతంగా కొనసాగిస్తున్నట్టు పలువురు చెప్పుకుంటున్నారు. ఇందుకు ఇజ్రాయెల్‌లో తయారైన పరికరాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నట్టు తెలిసింది. నగరంలోని రెండు ప్రాంతాల్లో ఇంటర్సెప్టర్స్, రికార్డర్స్, టెలికం సర్వీసు ప్రొవైడర్లు వినియోగించే కేబుల్స్, భారీ సామర్థ్యం ఉన్న హార్డ్‌డిస్క్‌లతో కంప్యూటర్లను ఏర్పాటు చేశారని సమాచారం. ఈ ప్రైవేటు ట్యాపింగ్‌కు సంబంధించిన ప్రధా న సర్వర్‌ను మాత్రం ఓ పోలీసు కార్యాలయంలో ఉంచినట్టు తెలిసింది. మాదకద్రవ్యాల నియంత్రణ కోసమే దీనిని వినియోగిస్తున్నామని బయటికి చెప్తున్నారని అంటున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈ సర్వర్ సేవలను 10-20 శాతం వినియోగించుకుంటుండగా.. ప్రైవేటు ట్యాపింగ్ కోసమే ప్రధానంగా దీనిని వినియోగిస్తున్నట్టు తెలుస్తున్నది.
‘ముఖ్య’నేత అనుచరుడి కనుసన్నల్లో
పోలీసుల ద్వారా ఫోన్‌ట్యాపింగ్ చేయి స్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే అనుమానంతోనే ప్రస్తుతం ‘ముఖ్య’ నేత వ్యవహారమంతా ప్రైవేటుగా నడిపిస్తున్నారని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతున్నది. పైగా మంత్రులు, ఇతరులకు పోలీసుల ద్వారా విషయం బయటికి పొక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని పూ ర్తిగా ప్రైవేటు ట్యాపింగ్‌కే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఏదైనా తేడా వచ్చినపుడు వెంటనే రెండుచోట్ల నుంచి ఆ పరికరాలను తరలించడం.. రహస్యంగా వాటిని ధ్వంసం చేయడం సులువు అవుతుందనేది వారి వ్యూహంగా ఉందని పార్టీ నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. ప్రైవేటుగా ట్యాపింగ్ జరుగుతుండటంతో బా ధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరిని ప్రశ్నించాలో తెలియక అయోమయంలో పడిపోయా రు. పోలీసుల ద్వారా ఈ వ్యవహారం జరుగుతుంటే అధికారులను హెచ్చరించవ చ్చు. కానీ ఇప్పుడు ఆ ప్రైవేటు వ్యక్తి ఎవ రో తెల్వదు? ఒకవేళ అనుమానం ఉన్నప్పటికీ ప్రశ్నించే పరిస్థితి ఉండదు. వీటికి ఆధారాలు దొరకవు. దీంతో బాధిత ప్రజాప్రతినిధులంతా ప్రైవేటు ట్యాపింగ్ తలచుకొని తలలు పట్టుకుంటున్నారు.
పైకి కనిపించేలా ఇంటెలిజెన్స్ నిఘా
మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ప్రధాన వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పడు ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుందనేది బహిరంగ రహస్యం. దీనిని తలదన్నేరీతిలో ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కొందరు వ్యక్తుల ఫోన్లను ప్రైవేటు ట్యాపింగ్ చేస్తున్నారనేది మంత్రుల స్వీయానుభవం ద్వారా బయటికొచ్చింది. దీనిపై సౌత్ ఫస్ట్ కథనాన్ని కూడా వెలువరించింది. మంత్రులు ఎక్కడికి వెళుతున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అనేది ప్రభుత్వ పెద్దకు చేరుతుంది. కాకపోతే ఇద్దరు మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్న విషయాల్ని ముఖ్య నేత మరో మంత్రికి చెప్పడంతో విషయం బయటికి పొక్కిందని ఆ కథనం పేర్కొంది. ఒక మంత్రి అధిష్ఠానానికి చేసిన ఫిర్యాదు వివరాలను కూడా ముఖ్య నేత నోటి నుంచి విన్న మంత్రి ఫోన్ ట్యాపింగ్‌ను సహచర మంత్రులకు ధ్రువీకరించినట్టు తెలిసింది.